బీసీలకు రిజర్వేషన్‌ తగ్గిస్తే తస్మాత్‌ : గట్టు

హైదరాబాద్‌, 6 సెప్టెంబర్‌ 2012 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 33 శాతం కంటే తగ్గితే వైయస్‌ కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ ఊరుకోబోదని పార్టీ బీసీ సెల్‌ కన్వీనర్‌ గట్టు రామచంద్రరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని సుప్రీంకోర్టు 2010 మే నెలలో తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో న్యాయసలహా తీసుకుని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే రివ్యూ పిటిషన్‌ ఎందుకు వేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు అప్పట్లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. బొత్స నిర్లక్ష్యంతో బీసీలు 10 శాతం రిజర్వేషన్లను కోల్పోయే ప్రమాదం తలెత్తింది. ఈ సమస్యపై నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడమే కాకుండా అధికారపక్షానికి వంతపాడింది’ అని దుయ్యబట్టారు. రాజీవ్‌ గాంధీ స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్‌ సర్కార్‌ వ్యవహరించింది. కాంగ్రెస్‌, టిడిపిలు ఏకమై బీసీలకు అన్యాయం చేస్తున్నాయి అని ఆయన విమర్శించారు.
బీసీలకు 10 శాతం జనరల్ సీట్లు ఇవ్వండి : బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత లభించే లోపు వారికి అన్యాయం జరగకుండా ఉండేందుకు స్థానిక ఎన్నికల్లో అన్ని పార్టీలు వెనుకబడిన వర్గాలకు 33 శాతం సీట్లు కేటాయించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి గతంలో చేసిన ప్రతిపాదనను గట్టు గుర్తు చేశారు. తమ ప్రతిపాదనకు అనుకూలంగా కాంగ్రెస్, టీడీపీలు ముందుకు వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఎలాంటి ఎన్నికలు వచ్చిన వైయస్‌ఆర్‌ సిపి సిద్ధంగా ఉన్నదని గట్టు స్పష్టం చేశారు.

Back to Top