బాబు విదేశీయానాల ‘రహస్యం’ తేల్చండి

ప్రధానికి లక్ష్మీపార్వతి లేఖ

హైదరాబాద్­, 26 ఆగస్టు 2012: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఏటా రహస్యంగా చేస్తున్న విదేశీ పర్యటనలపై కేంద్రం అత్యున్నత దర్యాప్తు సంస్థల చేత దర్యాప్తు చేయించాలని ఎన్‌టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్­ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి మన్మోహన్­సింగ్­కు ఆమె ఆదివారం ఒక లేఖ రాశారు. గడిచిన 15 ఏళ్లలో చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు చేసిన విదేశీ పర్యటనలు, విదేశాల్లో వారి ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించాలని ప్రధానిని కోరారు. ‘ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజా జీవితంలో ఉన్న చంద్రబాబు ఎక్కడికి వెళుతున్నారో చెప్పకుండా రహస్యంగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. అయితే అవి ఆయన వ్యక్తిగత అంశమైతే ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరంలేదు.

కానీ, గతంలో తెహెల్కా మ్యాగజైన్­ చంద్రబాబు దేశంలోనే అత్యంత సంపన్నుడైన రాజకీయ నాయకుడిగా ప్రకటించింది. బినామీ పేర్లతో చంద్రబాబుకు సింగపూర్­, మలేషియాల్లో హోటళ్లు, కమర్షియల్­ కాంప్లెక్స్‌­లు ఉన్నట్లు ఆ పత్రిక బయటపెట్టింది’ అని పేర్కొన్నారు. ‘చంద్రబాబు పార్టీ ద్వారా 2009 తర్వాత సి.ఎం.రమేష్, వై.వి.సుజనాచౌదరిలు రాజ్యసభలో అడుగుపెట్టారు. ప్రజాజీవితంలో పెద్దగా కనిపించని వీరు రాజ్యసభకు వెళ్లటం పట్ల చాలా మందికి ఆశ్చర్యం, ఆస్తకి కలిగించింది. 2009 సాధారణ ఎన్నికలకు ముందు ఈ ఇద్దరి ద్వారానే టీడీపీ ఎన్నికల కోసం మనీ లాండరింగ్­ చేసింది’ అని ఆమె ఆరోపించారు. గతంలో వీటిపై విచారణ జరపాల్సిందిగా వై.యస్­. విజయమ్మ కోర్టుకు నివేదించినప్పటికీ అత్యంత దురదృష్టకరమైన రీతిలో ఆ పిటిషన్­ తిరస్కరణకు గురైందన్నారు. హసన్­ ఆలీ మనీ లాండరింగ్ కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మాజీ ముఖ్యమంత్రి భాగస్వామ్యం ఉన్నట్లు ఈడీకి ఆయన వెల్లడించిన విషయం జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైందన్నారు. అప్పట్లో హసన్­ ఆలీ వ్యవహారం బైటకొచ్చిన కొద్ది రోజుల్లోనే చంద్రబాబు హడావుడిగా విదేశీ పర్యటనకు వెళ్లారని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు.

Back to Top