కిడ్నీ బాధితులకు నెలకు రూ.10 వేలు పింఛన్‌

ఉద్దానం ఏరియాలోకి ప్రవేశించిన వైయస్‌ జగన్‌ పాదయాత్ర
 

శ్రీకాకుళం: వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక కిడ్నీ బాధితులకు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10 వేలు పింఛన్‌ ఇచ్చి అండగా ఉంటామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటిక్రితం ఉద్దానం ఏరియాలోకి ప్రవేశించింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారిని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందడం లేదని కిడ్నీ బాధితులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు.

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి పెన్షన్‌  ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ముగ్గురు, నలుగురు కిడ్నీ వ్యాధిగ్రస్తులుంటే ఒక్కరికిమాత్రమే డయాలసిస్‌ చేయిస్తున్నారని బాధితులు తెలిపారు. ఆసుపత్రికి వెళ్తే కనీసం మందులు కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. డయాలసిస్‌ యంత్రాలు సరిపోక రోజుల తరబడి పడిగాపులు కాయల్సి వస్తుందని వైయస్‌ జగన్‌కు వివరించారు. కిడ్నీ వ్యాధితో వందల మంది చనిపోతున్నారని బాధితులు జననేతకు చెప్పారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌..వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితులకు రూ.10 వేలు పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్దానం ఏరియాలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. కిడ్నీ బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వైయస్‌ జగన్‌ హామీతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 
 

Back to Top