మహానుభావులకు మన దేశంలో కరువా?

మన పుణ్యభూమిలో సిరిసంపదలకు కరువుండొచ్చు. మహానగరాల్లో సైతం మన ఆడపడుచులకు భద్రతకు కరువుండొచ్చు. బీదసాదల పిల్లలకు ఉన్నత విద్యావకాశాలకు కరువుండొచ్చు. కులమతాల ప్రసక్తిలేని సామాజిక న్యాయానికి కరువుండొచ్చు. గృహవసతికి కరువుండొచ్చు. కట్టుబట్టలకు కరువుండొచ్చు. కరెంటుకు కరువుండొచ్చు. కష్టం చెయ్యడానికి వెనకాడకపోయినా తిండికి కరువుండొచ్చు. తాగు నీరూ సాగు నీరూ దొరకని ఊళ్లుండొచ్చు. కానీ, మన దేశంలో మహానుభావులకు కరువుండదు.

చరిత్ర పూర్వ యుగంలోనే పదార్థ విజ్ఞానంలో ప్రపంచం తలదన్నే రీతిలో అతి సూక్ష్మమయిన కణాల నిర్మాణం గురించి చెప్పిన కణాదుడు పుట్టిన గడ్డ ఇది. ఇతర దేశాల్లో వైద్య విజ్ఞానం తప్పటడుగులు వేసే రోజుల్లోనే శుశ్రుతుడు ‘ప్లాస్టిక్‌ సర్జరీ’ చేసిన నేల ఇది. వేరే దేశాల్లో మహా మేధావుల ఊహకు మించిన స్థాయిలో తాత్విక చర్చ చేసిన మనీషులు పుట్టిన పుణ్యభూమి ఇది. ఖగోళ శాస్త్ర పరిజ్ఞానంలో ఆకాశమే హద్దనిపించుకున్న పరిశోధకులు జెండా ఎగరేసిన గడ్డ ఇది. మహావీరుడూ, బుద్ధుడూ, ఆదిశంకరుడూ నడయాడిన నేల ఇది. వ్యాసుడూ, వాల్మీకీ, భాసుడూ, కాళిదాసూ, భవభూతీ పుట్టిన గడ్డ ఇది. ఒక బసవణ్ణా, ఒక వేమన్నా, ఒక వీర బ్రహ్మం, ఒక కందుకూరీ, ఒక గురజాడా, ఒక గిడుగూ పుట్టిన గడ్డ ఇది.

ఇలాంటి చోట దేనికయినా కరువుండొచ్చు గానీ, మహానుభావులకు కరువుంటుందా? ఎంతమాత్రం ఉండదు! పెపైచ్చు పదిమందినో, యాభయ మందినో, వందమందినో మహానుభావులను గుర్తించమంటేనే మనకు ఇబ్బంది. ‘గాంధీ తర్వాత మహామనిషి’ అనే ఎంపిక ప్రక్రియలో ఎదురయిన సమస్యలను వివరిస్తూ ప్రముఖ మేధావి రామచంద్ర గుహ -‘ద హిందూ’ పత్రికలో- రాసిన వ్యాసంలో ఈ ఇబ్బంది గురించి సవివరంగా పేర్కొన్నారు. గాంధీజీ భారత రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన కాలం మూడు దశాబ్దాలలోపే. అయితే, మన స్వాతంత్య్రోద్యమ కాలంలో ఆ మూడు దశాబ్దాలూ అత్యంత కీలకమయినవి. అందుకే మన స్వాతంత్య్రోద్యమ యుగానికి ఆయనే శకపురుషుడుగా నిలిచాడు. గాంధీజీని ఆ స్థానంలో నిలబెట్టడమంటే, నెహ్రూకో, అంబేడ్కర్‌కో, పటేల్‌కో అన్యాయం చెయ్యడమేననుకునే వారిని వదిలెయ్యండి.

‌ఈ ఎంపిక ప్రక్రియకు ప్రాతిపదికే గాంధీజీ. ఆయన తర్వాత చెప్పుకోదగిన మహామనిషి ఎవ్వరన్నదే ప్రశ్న. ఇంతకు ముందు ప్రస్తావించుకున్న ముగ్గురు మహానుభావులు కాకుండా ఇందిరా గాంధీ, మదర్ థెరిసా, లతా మంగేష్క‌ర్, అటల్ బిహారీ వా‌జ్‌పేయీ, జే.ఆర్.డీ.టాటా, అబ్దుల్ కలా‌మ్, సచిన్ టెండూల్కర్‌ల పేర్లు షార్ట్‌లి‌స్ట్ చేసి తన ముందుకు పంపడం మన మేధావి గుహను కలవరపరిచింది.

ఒక దశలో కిర‌ణ్ బేదీ పేరు కూడా ఈ మహామనుషుల జాబితాలో కనిపించింది కానీ, సంఘ సంస్కర్తగానూ, స్వాతంత్య్ర సమరయోధగానూ, భారతీయ హస్తకళలను పునర్జీవింపచేసిన మహావ్యక్తిగానూ, సహకార ఉద్యమానికి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన మహిళగానూ ఎన్నో విధాల దేశానికి సేవలందించిన కమలాదేవీ చట్టోపాధ్యాయ పేరు మాత్రం ఈ జాబితాలో కనిపించనందుకు గుహ బాధపడ్డారు. అలాగే, ప్రపంచ ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్తలు హోమీ భాభా, విక్ర‌మ్ సారాభా‌య్, ఎం.ఎ‌స్ స్వామినాథ‌న్ లాంటివాళ్ల పేర్లు గానీ- మన దేశంలో హరిత విప్లవం ప్రవేశపెట్టిన ఆనాటి వ్యవసాయ మంత్రి సి.సుబ్రహ్మణ్యం పేరుగానీ- మనదేశంలో పుట్టి ప్రపంచమంతా వ్యాపించిన చదరంగం ఆటలో విశ్వవిఖ్యాతి పొందిన విశనాథ‌న్ ఆనం‌ద్ పేరుగానీ- జ్ఞా‌న్‌పీఠ్ పురస్కారం అందుకున్న మహారచయిత శివరామ కారంత పేరుగానీ ఈ జాబితాల్లో కనిపించనందుకూ గుహ ఆవేదన ప్రకటించారు. ఈ మహనీయులందరూ ‘టెలివిజన్ యుగం’లో పుట్టకపోవడం వల్లనే ఇలా జరిగిందేమోనని కూడా గుహ వ్యాఖ్యానించారు. ఏమో- అదే నిజమేమో!

మొత్తమ్మీద గుహ రాసిన వ్యాసం కూడా రుజువు చేస్తున్న విషయం ఒక్కటే- మన దేశంలో మహామనుషులకు కరువేం లేదు!

Back to Top