బాబు పాలనపై ప్రజాగ్రహం
పత్తికొండ: రుణమాఫీ చేస్తామంటే టీడీపీ నేతల మాటలు నమ్మాము. రెండున్నరేళ్లుగా హామీ నెరవేరకపోగా రుణాలపై వడ్డీలేసి నడ్డి విరచారని పొదుపు సంఘాల మహిళలు ఆవేదన. పింఛన్లు, ఇళ్లు ఇస్తామని ఓట్లేసుకున్నారు... గ్రామం వైపు తొంగి చూడడం లేదు అని పెరవలి గ్రామస్తుల ఆవేదన. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జీ చెరుకులపాడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మద్దికెర మండల పరిధిలోని పెరవలి గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను నారాయణరెడ్డి చెప్పుకొని విలపించారు. బాబును నమ్మి మోసపోయామని అన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
వైయస్సార్నగర్లోని బుడగజంగాల కాలనీ, టైలర్స్ కాలనీల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని వైయస్సార్సీపీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన పట్టణంలోని 38వ వార్డులో పర్యటించారు.
హామీలు అమలు చేయాల్సిందే..!
ఆళ్లగడ్డ: ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన పట్టణంలోని 19, 20, 21వార్డుల్లో పర్యటించారు. అనంతరం వంద ప్రశ్నలతో కూడిన ప్రజా బ్యాలెట్‌ను ప్రజలకు అందజేసి, చంద్రబాబు పాలనపై మార్కులు వేయించారు.
నీరో చక్రవర్తిలా..
శ్రీశైలం: ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు నీరో చక్రవర్తిగా వ్యవహారిస్తున్నాడని వైయస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇంచార్జీ బుడ్డా శేషారెడ్డి విమర్శించారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన బండిఆత్మకూరు మండలం చిన్నదేవాలపురం గ్రామంలో ఆయన పర్యటించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు.
ఒక్క హామీ నెరవేరితే ఒట్టు
నందికొట్కూరు(పగిడ్యాల): టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్న హామీలలో ఒక్కటి నెరవేరితే ఒట్టు అని నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన పగిడ్యాలలోని దేవనగర్కాలనీ, మైనార్టీ కాలనీ, తెలుగుపేట కాలనీలో పర్యటించారు. అనంతరం ప్రజాబ్యాలెట్‌ను ప్రజలకు అందజేసి చంద్రబాబు పాలనపై మార్కులు వేయించారు.
బాబు పాలనపై కన్నెర్ర
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పార్టీ నాయకులతో కలిసి భవానీ నగర్ లోని 35వ వార్డులో గడపగడపకూ వైయస్సార్ కాగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాబు చేసిన ఎన్నికల హామీలకు సంబంధించి ప్రజలకు కరపత్రాలను అందించి సమాధానాలు రాబట్టారు. ప్రజలు చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు.
వైయస్సార్సీపీ గెలుపుతోనే అభివృద్ధి
బనగానపల్లె నియోజకవర్గ ఇంఛార్జ్ కాటసాని రామిరెడ్డి బి.పల్లి మండలం, మీరపురం గ్రామంలో గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి బాబు మోసాలను వివరించారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్న చంద్రబాబు దురాగతాలను ప్రజలకు తెలియజెప్పారు. రానున్న ఎన్నికల్లో వైయస్సార్సీపీని గెలిపించుకొని మన జీవితాలను బాగుపర్చుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.