ప్ర‌జా పాద‌యాత్ర‌లో ప్ర‌త్యేక హోదా నినాదాలు- వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌లో నిన‌దించిన యువ‌త‌
- ప్ర‌కాశం జిల్లాలో దిగ్విజ‌యంగా సాగుతున్న ప్ర‌జా పాద‌యాత్ర‌
ప్ర‌కాశం: ప‌్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అని ప్ర‌కాశం జిల్లా యువ‌త నిన‌దించారు.  వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కోసం వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన ప్రజా పాదయాత్ర ఆరో రోజు సోమ‌వారం ప్రారంభ‌మైంది. ఆదివారం మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని తర్లుపాడు, మార్కాపురం, కంభం మండలాల్లో 15 కి.మీల మేర సాగింది. ఇవాళ పాద‌యాత్ర‌లో ఎమ్మెల్యే ముస్తాఫా, జంకె వెంకటరెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి బ‌త్తుల బ్ర‌హ్మానంద‌రెడ్డిలు వైవీ సుబ్బారెడ్డి వెంట నడిచారు.  ప‌లువురు యువ‌కులు ప్ర‌త్యేక హోదా ఫ్ల‌కార్డులు ప‌ట్టుకొని ప్ర‌జా పాద‌యాత్ర‌లో న‌డిచారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన వైవీ సుబ్బారెడ్డిని స్థానికులు అభినందించారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ని చెప్పారు. హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ మొద‌టి నుంచి పోరాటం చేస్తుంద‌ని, ఉద్య‌మంలో భాగంగానే చివ‌రి బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిసిన త‌రువాత ఐదుగురు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశామ‌న్నారు. ఈ పోరాటం ఇంత‌టితో ఆగ‌ద‌ని చెప్పారు. వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కాగానే ఏడాది లోపు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అనంతపురం తరువాత అత్యల్పంగా వర్షపాతం నమోదైన కరువు ప్రాంతంగా ఉన్నది ప్రకాశం జిల్లానేనన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే 2009 నాటికే వెలిగొండ ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. పాదయాత్రలో గ్రామాల్లో పర్యటిస్తుంటే పొలాలు బీళ్లుగా ఉన్నాయని, ప్రజలు, పశువులు, జీవాలు కూడా నీరు లేక అలమటిస్తున్నాయని, దీనికి కారణం చంద్రబాబేనన్నారు. వెలిగొండ ప్రాజెక్టు  పూర్తి చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు.
Back to Top