హైదరాబాద్ 17 జూలై 2013:
పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఏకగ్రీవమైన పంచాయతీలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధిక్యమని పార్టీ సీనియర్ నేత, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అయిన డాక్టర్ ఎమ్.వి. మైసూరా రెడ్డి వెల్లడించారు. ఏకగ్రీవ పంచాయతీల్లో 600 పంచాయతీలను పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారని తెలిపారు. పార్టీ మద్దతుదారులపై నమ్మకముంచిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల తేదీలు ప్రకటించిన నాటినుంచి ఆధిక్యం సాధించేందుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నో కుయుక్తులు పన్నాయన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో తమ మద్దతుదారుల అపహరణకు, నెల్లూరు జిల్లాలో ఎన్నికైన అభ్యర్థులకు కాంగ్రెస్ కండువాలు కప్పి వారివైపు తిప్పుకోవడానికీ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు.
పార్టీ మద్దతుదారులుఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల వివరాలు ఇలా ఉన్నాయి. వైయస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో 9 పంచాయతీలను పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో 10, పులివెందుల నియోజకవర్గంలో 24 ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. పుల్లంపేట మండలం జలగవారిపల్లెలో వైయస్‌ఆర్ సీపీ మద్దతుదారు శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజవర్గం గొల్లలకుంట పంచాయతీలో వైయస్ఆర్ సిపి మద్దతుదారుడు, పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ మల్లవరం పంచాయతీ, రంపచోడవరం నియోజకవర్గం ఎల్లవరం, మట్లపాడు పంచాయతీలలో పార్టీ మద్దతుదారులే ఎన్నికయ్యారు. రామచంద్రపురం నియోజకవర్గం పేకేరు, తామరపల్లి, ఎండగండి, ఆదివారపుపేట, తనుమళ్ల, తార్లంపూడిలలో పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవమయ్యారు.
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో 5 పంచాయతీలు జలాల్పూర్, సిద్ధాపూర్, బొప్పాపూర్, రాంపూర్, పోచారంలలో పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెదక్ జిల్లా జహిరాబాద్ మండలంలోని ఒకటి, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో 10 గ్రామ పంచాయతీలలో పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.