చంద్రబాబు పాలనే ఓ అబద్ధం

వందల హామీలను ఇచ్చి ప్రజలందరినీ మోసం చేశాడు
పేదరికంపై గెలుపు కాదు.. పేదవాడిపై మోసాల బాబు గెలుపు
ఓట్ల కోసం మభ్యపెట్టేందుకే మంత్రి వర్గ విస్తరణ
సబ్‌ ప్లాన్‌ నిధులు సక్రమంగా ఖర్చు చేయకుండా దారి మళ్లించారు
విద్యా వ్యవస్థను నారాయణ, శ్రీచైతన్యలకు కట్టబెట్టారు
భూములు ఎవరికి పంచారో శ్వేతపత్రం విడుదల చేయాలి
హైదరాబాద్‌: ఏ ఒక్క కులాన్ని కూడా వదలకుండా అన్నివర్గాలను చంద్రబాబు మోసం చేశాడని, చంద్రబాబు పాలనే అబద్ధమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. మంత్రివర్గంలో మైనార్టీలకు, గిరిజనులకు ఎందుకు స్థానం కల్పించలేదని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేకసార్లు చంద్రబాబును నిలదీశారన్నారు. ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా ఇప్పుడు నిద్రలేచి గిరిజనులు, మైనార్టీల మీద కొత్త ప్రేమ వలకబోస్తున్నాడన్నారు. మభ్యపెట్టేందుకు మంత్రి వర్గంలో ఇద్దరికి చోటు కల్పించారన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదరికంపై గెలుపు అనే చంద్రబాబు నినాదం ఈ యుగంలో పెద్ద జోకుగా వైయస్‌ఆర్‌ సీపీ అభివర్ణిస్తుందన్నారు. పేదరికంపై గెలుపుకాదు.. పేదవాడిపై మాయమాటలు చెప్పి చంద్రబాబు జట్టు గెలిచిందన్నారు. పేదవాడిపై, బలహీనవర్గాలపై, దళితులు, మైనార్టీలు, అనగారిన వర్గాలపై దోపిడీ చేసి గెలిచారన్నారు. 

2014 ఎన్నికల ముందు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో కూర్చొని రచించి విడుదల చేసిన మేనిఫెస్టోలో ఎన్ని హామీలను నెరవేర్చారని ప్రశ్నించారు. ఆ మేనిఫెస్టోలో బీసీలకు 4 పేజీలు, ఎస్సీ, ఎస్టీలకు 4 పేజీలు, మైనార్టీలకు, బ్రాహ్మణులకు, కాపులకు ఒక్కొక్క పేజీ చొప్పున 10 పేజీల హామీలు ఇచ్చారన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో హామీలు నెరవేర్చాలని ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నామన్నారు. ఏ ఒక్క కులాన్ని వదలకుండా ప్రతి ఒక్కరినీ అభివృద్ధి చేస్తామని నమ్మించి ఓట్లు దండుకున్న తరువాత మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు పేదరికంపై గెలుపు అనడం సిగ్గుచేటన్నారు. 

చంద్రబాబు తన పాలనలో బీసీలను, ఎస్సీ, ఎస్టీలను, మైనార్టీలను, కాపులను అన్ని విధాలుగా దోచుకున్నారన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ పేరుతో రూ. 3 నుంచి రూ. 5 వేల కోట్లు కేటాయించి ఆ ధనాన్ని 50 శాతం కూడా ఖర్చు చేయలేని దుర్మార్గపు ప్రభుత్వం చంద్రబాబుదన్నారు. కుప్పలుగా హామీలు ఇచ్చారు. ఎస్సీలకు సంబంధించిన సబ్‌ప్లాన్‌లో 50 శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు. కార్పోరేషన్ల వారిగా లెక్కలు చెప్పారని, చంద్రబాబు 8 లక్షల యూనిట్లు అంటున్నారని, 8 పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియని అసమర్థపు ప్రభుత్వం చంద్రబాబుదన్నారు. అందరికీ సమానమైన న్యాయం చేస్తానని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబు చేసే ప్రతీ కార్యక్రమం అబద్ధమే అన్నారు. సబ్‌ప్లాన్‌ నిధులు ఏ విధంగా దారి మళ్లించారో గ్రామాలకు వస్తే ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు.

ఉన్నత విద్య పేదవాడికి అందని ద్రాక్షగా మారిందని, నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలకు విద్యా వ్యవస్థను చంద్రబాబు తాకట్టుపెట్టాడని సుధాకర్‌బాబు మండిపడ్డారు. పేదవాడికి విద్య లేదు, ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, కూలీలకు డబ్బులు లేవు, ఆస్పత్రులు లేవు ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు ఆంధ్రరాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ఉన్నాయన్నారు.
 
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పేదవారిని అభివృద్ధి చేసేందుకు సుమారు 22 వేల ఎకరాలను పంచారని సుధాకర్‌బాబు అన్నారు. చంద్రబాబు పాలనలో ఏయే కులానికి భూములు కేటాయించారని, ఏయే సంస్థలకు ఇచ్చారో వారి పేర్లను బయటపెట్టాలన్నారు. రాజధాని నిర్మాణంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపుల వాటా ఎంత అనేది చంద్రబాబు వెల్లడించాలన్నారు. రాజధాని నిర్మాణంలో కేటాయించిన ప్లాట్లలో హరిజనులు, గిరిజనులకు ప్రత్యేకంగా భూములు కేటాయించారన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి లాక్కున్న 33 వేల ఎకరాల్లో ప్రైవేట్‌ విద్యా సంస్థలకు ఏ విధంగా భూములు కేటాయించారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పేదరికంపై గెలుపు అంటున్న చంద్రబాబు ఏ పేదవారికి కేటాయించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

సబ్సిడీపై ఇచ్చి కార్లు, ట్రాక్టర్లు ఎవరికి ఇచ్చారు.. ఎవరి పేరు మీద ఎవరు వినియోగిస్తున్నారో చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. దళిత కాలనీల్లో వేసే రోడ్ల కాంట్రాక్టర్లు కూడా చంద్రబాబు తాబేదారులన్నారు. మైనింగ్‌ లీజుల్లో ఒక్క ఎస్సీ, బీసీ, మైనార్టీ, గిరిజనులు ఉన్నారా..? ఇప్పటికైనా కళ్లు తెరవండి చంద్రబాబూ అని విరుచుకుపడ్డారు. గిరిజన ఎమ్మెల్యే మావోయిస్టుల దాడితో ఎందుకు చనిపోయారనే మూలాలు వెతకలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎస్సీ నాయకుడిని పుట్టనబెట్టుకున్న పాపం చంద్రబాబుకు తగులుందన్నారు. ఎమ్మెల్యే ఎందుకు చనిపోయాడో.. ఈ రోజుకైనా విచారణ చేపట్టారా..? అని ప్రశ్నించారు. 

ఇసుక దోపిడీ ఎక్కడ జరుగుతుంది..? ఎవరెవరు దోచుకుంటున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని సుధాకర్‌బాబు డిమాండ్‌ చేశారు. పరిశ్రమలు వచ్చాయని చెబుతున్నారు. వారి కులాలు, పేర్లు ఏంటీ..? సభ్యులుగా ఉన్నవారెవరో వివరాలు చెప్పాలన్నారు. అప్పుడు మీరు పేదరికంపై గెలుపు అనే టైటిల్‌ను ఒప్పుకుంటామన్నారు. రెండు మూడు సామాజిక వర్గాలను బతికించడానికే చంద్రబాబు పనిచేస్తున్నారని సుధాకర్‌బాబు అన్నారు. భూముల లీజ్‌ వివరాలు తెలియజేయండి. కార్పొరేషన్‌ చైర్మన్లు ఏయే కులాలకు చెందిన వారు ఉన్నారో చెప్పాలన్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీల్లో కులాల వాటా ఎంతో లెక్కలు చెప్పాలన్నారు. కొత్త విద్యా సంస్థలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు వాటా ఎంత ఇచ్చారో చెప్పాలి. ఆర్టీసీ బస్సుల లీజు కూడా ఏయే కులాలకు ఇచ్చారో చెప్పాలి. చంద్రబాబు చెప్పేది ఒకటి.. చేసేది ఒకటని, సామాజిక న్యాయం అంటే చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు. కనీసం ప్రజలకు చిన్న చిన్న సౌకర్యాలు కల్పించలేని దుర్మార్గపు ప్రభుత్వంలో న్యాయం జరగదని ప్రజలకు అర్థమైందన్నారు. 

హోంమంత్రి చినరాజప్ప వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని సుధాకర్‌బాబు అన్నారు. విచారణకు సహరించేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన గంటలోనే ముఖ్యమంత్రి, డీజీపీ మీడియా ముందుకు వచ్చి అబద్ధం చెప్పారన్నారు. ప్రచారం కోసం వైయస్‌ఆర్‌ సీపీ చేసుకుందని చెప్పిన వ్యాఖ్యలకు సంజాయిషి చెప్పాలని డిమాండ్‌ చేశారు. హత్యాయత్నంపై విచారణ సమగ్రంగా జరగాలని, ఎవరు చేయించారో తేలుతుందన్నారు. ఆ బాధ్యత ప్రభుత్వంపై ఉందనే కనీస జ్ఞానం హోంమంత్రికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. 
Back to Top