ఎన్నికలపై వైయస్ఆర్‌సీపీ 4 రోజుల సమీక్ష

హైదరాబాద్:

సార్వత్రిక ఎన్నికలపై వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ఈ నెల 29 నుంచి నాలుగు రోజుల పాటు సమీక్షలు నిర్వహించనుంది. సీమాంధ్రలోని 13 జిల్లా కేంద్రాల్లో ఈ సమీక్షలు విడివిడిగా ఎక్కడికక్కడే జరుగుతాయి. సమీక్షా సమావేశాల నిర్వహణకు ఒక్కొక్క జిల్లాకు విడివిడిగా అనుభవజ్ఞులైన నేతలతో త్రిసభ్య కమిటీలను పార్టీ అధినాయకత్వం ఏర్పాటు చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు, ఓటములకు దారితీసిన పరిస్థితులపై ఈ సమీక్షలో లోతుగా అధ్యయనం, విశ్లేషణ జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులుగా పోటీచేసిన వారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమీక్షా సమావేశాల్లో ప్రధానంగా పాల్గొంటారు. ఈ నెల 29న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైయస్ఆర్ కడప, 30న కృష్ణా, అనంతపురం, 31న కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, జూన్ 1న తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, విశాఖపట్టణం జిల్లాల్లో సమీక్షలు జరుగుతా‌యని ఆయా జిల్లాలకు పార్టీ వర్తమానం పంపింది.

Back to Top