అసెంబ్లీలో వైయస్ఆర్‌సీపీ చరిత్రాత్మక పాత్ర

హైదరాబాద్

: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు -2013ను వెనక్కి తిప్పి పంపడంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చరిత్రాత్మక పాత్ర పోషించిందని పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఆడిన విభజన నాటకంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు తొత్తులుగా వ్యవహరించారని ఆయన దుయ్యబట్టారు. వారిద్దరూ సమైక్యం ముసుగులో ఉన్న ద్రోహులని భూమన ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు. సమైక్య రాష్ట్రం కోసం నాలుగు నెలలుగా లక్షలాది మంది కార్యకర్తలు విరోచితంగా పోరాడారని ఆయన తెలిపారు.

సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చింది సీఎం కిరణే అని కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఊసరవెల్లిగా రంగులు మార్చే వ్యక్తి కిరణ్ అని ‌నిప్పులు చెరిగారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదేమని నిలదీశారు. చంద్రబాబు ఏనాడైనా సమైక్యం అన్న మాట అన్నారా అని ప్రశ్నించారు. విభజన బిల్లు ప్రక్రియపై ఆఖరి నిమిషం వరకూ కిరణ్, చంద్రబాబు పరస్పర అవగాహనతో కేంద్రానికి సహాయపడ్డారని భూమన కరుణాకరరెడ్డి తూర్పారపట్టారు.

విభజన బిల్లు వ్యవహారంలో కాంగ్రెస్, టీడీపీలు తమ అవకాశవాద రాజకీయాలను ప్రస్ఫుటంగా బయటపెట్టుకున్నాయని భూమన విమర్శించారు. విభజన బిల్లు ప్రక్రియ వేగవంతం కావడానికి సీఎం కిరణ్‌ ఇన్ని రోజులుగా సహాయ పడుతూనే ఉన్నారని ఆయన ఆరోపించారు. అలాగే బిల్లుపై చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సిన సమయంలోనే తిరస్కరణ నోటీసు ఇవ్వడం ద్వారా చంద్రబాబు నాయుడికి కూడా కిరణ్‌ సహాయపడ్డారన్నారు.

కిరణ్ గబ్బిలంలా పదవిని పట్టుకుని వేలాడుతున్నారని ఎద్దేవా చేశారు. విభజనకు మొదటి ద్రోహి సీఎం కిర‌ణే అన్నారు. కోర్‌ కమిటీలో గంగిరెద్దులా తల ఊపారని చెప్పారు. పదవి కోసం సీఎం, టిడీపీని రెండు ప్రాంతాల్లోనూ కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు విభజనకు దారి చూపారన్నారు. విభజన రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని భూమన హెచ్చరించారు.

స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను నిలువునా దగా చేసిన కాంగ్రెస్, టీడీపీలకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేసే నైతికత లేదని భూమన వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర కోసం తొలి నుంచి పట్టుదలగా నిలబడి పోరాటం చేస్తున్నది ఒక్క వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే అని కరుణాకరరెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top