బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్ రెడ్డి , సుజయకృష్ణ రంగారావులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  25 మంది కార్పొరేట్ శక్తుల కోటరీ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తోందంటూ చంద్రబాబు సర్కార్పై  మండిపడ్డారు. హైదరాబాద్లో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద  ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు విలేకర్లతో మాట్లాడారు.

ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును వైఎస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని వారు స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఈ బిల్లును వ్యాపార ధృక్పథంతో తీసుకొచ్చిందని వారు ఆరోపించారు. ఈ బిల్లు వల్ల విద్యార్థులకు పూర్తిగా నష్టం కలుగుతుందని విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేకుండా చేసి ఇంతమందికి అన్యాయం చేసే బిల్లును శాసనసభలో పాస్ చేసుకోవడం దురదృష్టమని వారు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా శాఖ బాధ్యతల నుంచి తప్పుకుని... కార్పొరేట్ చేతుల్లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ విద్యా, వైద్యాన్ని పూర్తిగా కార్పొరేట్ చేతుల్లో పెట్టేస్తోందని విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి మాత్రం చంద్రబాబుకు చేతులు రావడం లేదని వారు నిప్పులు చెరిగారు.

 మంత్రులు, ఎమ్మెల్యేలు విదేశాల్లో జల్సాలు చేయడానికి మాత్రం రూ. కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 20 ప్రభుత్వ యూనివర్శిటీలను ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికొదిలేసిందని ఎమ్మెల్యేలు ఫైరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top