కేశవ్‌ దిగజారుడు వ్యాఖ్యలకు పరాకాష్ట

హైదరాబాద్ :

రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ విధానంలో స్పష్టత లేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది. చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్థమైందని పేర్కొంది. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉద్యమిస్తున్న విషయం కూడా రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని తెలిపింది. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను చూస్తే చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు ఏ విధంగా తయారయ్యారో స్పష్టం అవుతోందని వారు దుయ్యబట్టారు.

రెండు కళ్లు, ఇద్దరు కొడుకులు, కొబ్బరి చిప్పల సిద్ధాంతాలు వల్లిస్తున్న చంద్రబాబు నాయుడు తన చెంబుగ్యాంగ్ చేత దిగజారుడు వ్యాఖ్యలు చేయిస్తున్నారని‌ శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరు ప్రాంతాల టీడీపీ నాయకుల చేత వారి వారి ప్రాంతాల వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తీరును వారు తప్పుపట్టారు. సమైక్యాంధ్రప్రదేశ్‌ కోసం రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు, స్పీకర్‌కు అందజేసే అఫిడవిట్లపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి చేత సంతకం చేయించగలరా? అని టీడీపీ నేతలను శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి సవాల్‌ చేశారు. 'మేము మా పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డితో కలిసివెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతికి విన్నవిస్తాం. మీరు చంద్రబాబు నేతృత్వంలో పార్టీ నాయకులంతా కలసి రాష్ట్రపతిని కోరగలరా?‘ అని అఫిడవిట్ల ఆలోచన తమదే అంటున్న పయ్యావుల కేశవ్‌ను సూటిగా ప్రశ్నించారు.

రాజకీయాల్లో చీర్‌గరల్సు, చింతామణి పాత్రలు ఎవరు పోషిస్తున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. పయ్యావుల కేశవ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అని వారు తూర్పారపట్టారు. పయ్యావుల మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్రకు కట్టుబడి, విలువలు, నిబద్ధతతో పోరాడుతున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే నైతిక హక్కు టీడీపీకి, అవకాశవాద రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు లేదన్నారు.

శాసనసభలో పార్లమెంటులో ఇరు ప్రాంతాల టీడీపీ సభ్యులు ఆడిన డ్రామాలు, నటించిన పాత్రలు ప్రజలు మరిచిపోలేదన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో జరిగిన నిరసనకు టీడీపీకి చెందిన ఆరుగురు ఎంపీలకు గానూ ఆ పార్టీ సభాపక్ష నాయకుడు సహా రమేశ్‌ రాథోడ్‌ దూరంగా ఉన్న వైనాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. నలుగురు టీడీపీ ఎంపీలు మాత్రమే లోక్‌సభ వెల్‌లోకి వచ్చిన వైనాన్ని దేశం మొత్తం చూసిందరన్నారు. ఒక్కొక్క ఎన్నికలో ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకొని కండువాలు వేసుకుంటున్న చంద్రబాబు విశ్వసనీ‌యుడు అని పయ్యావుల చెప్పడాన్ని ‘జోక్ ఆఫ్ ది ఇయర్’‌ అని శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదని, ఓట్లు, సీట్లే తనకు ముఖ్యమని చంద్రబాబు భావిస్తున్నారని, టీడీపీకి ఆ పేరు తీసేసి ‘వన్ బై టు పార్టీ’ అని ‌పెట్టుకోవాలని శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. టీడీపీ - బీజేపీ పొత్తుపెట్టుకున్నా తమకు ఎలాంటి భయం లేదని వారు స్పష్టంచేశారు.

గుర్రాన్ని గాడిదను ఒకే గాటన కడుతున్నారు :
ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు గుర్రాన్ని, గాడిదను ఒకే గాటన కడుతున్నారని శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. సమైక్యాంధ్ర వాదనపై సరైన స్పష్టత లేని వారితో తాము వేదికను పంచుకోలేమని శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. సమైక్య ఉద్యమాన్ని నడిపించిన అశోక్‌బాబు ప్రతీ రాజకీయ పార్టీ సమైక్యం వైపు రావాలని పార్టీల అధ్యక్షులను కోరి ఉంటే విభజన ఇంత దూరం వచ్చేదే కాదన్నారు. ఇప్పుడు అశోక్‌బాబు చేయాల్సింది సమావేశానికి పార్టీ ప్రతినిధులను కాకుండా అధ్యక్షులను రమ్మని పిలవాలని, అందుకు శ్రీ జగన్ సిద్ధం అని శోభా‌ నాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి స్పష్టంచేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top