ఎమ్మెల్యే సహా 300 మంది అరెస్ట్

  • తాగునీటి సమస్యపై విశ్వేశ్వర్‌రెడ్డి పోరుబాట
  • ప్రజలతో కలిసి పీఏబీఆర్‌ ప్రాజెక్టు ముట్టడించిన ఎమ్మెల్యే 
  • అడ్డుకున్న పోలీసులు..ఎమ్మెల్యే, పార్టీ నేతల అరెస్ట్
ఉరవకొండ: తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం వల్లే అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఉరవకొండ నియోజకవర్గంలో 90 గ్రామాలకు తాగునీటి సమస్య తీర్చేందుకు  56 కోట్లతో పీఏబీఆర్‌ ప్రాజెక్ట్‌ వద్ద నిర్మించిన మంచినీటి పతకం పూర్తి అయ్యి 6 నెలలు గడుస్తున్నా ప్రారంభించకపోవడాన్ని నిరసిస్తూ  విశ్వేశ్వరరెడ్డి వందలాది మంది ప్రజలతో కొరక్రోడు వద్ద ప్రాజెక్టు ను ముట్టడించారు. పైపులైన్‌ పనులు పూర్తయినా తాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదని అధికారులను నిలదీశారు. 

ఈ సందర్భంగా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాలో అనంతపురం రెండవదని, దాంట్లో కూడేరు మండలంలో కేవలం 250–350 మి.మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుందన్నారు. జిల్లా ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేయాలని దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి శ్రీరాంరెడ్డి, జేసీనాగిరెడ్డి ప్రాజెక్టులను తీసుకొచ్చారని గుర్తు చేశారు. జిల్లా అంతా తాగునీటి సమస్య పరిష్కరించడానికి వైయస్‌ఆర్‌ కృషి చేశారన్నారు. 2013లో ఉరవకొండ నియోజకవర్గంలోని 90 గ్రామాలకు నీరు ఇవ్వడానికి నీటి పారుదల పైపులైన్‌ ప్రారంభించారన్నారు. 2015లో నీళ్లు ఇవ్వాల్సివున్నా.. 2019 మే వచ్చినా నీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యవైఖరి దీనికి ప్రధాన కారణం అన్నారు. 

టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవులు ఉరవకొండ నియోజకవర్గంలోని గ్రామాలకు నీరు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని అధికారులే చెబుతున్నారని మండిపడ్డారు. ఆఖరికి తాగునీటి పథకాన్ని కూడా అడ్డుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబు కరువును జయించాం.. విజయం సాధించాం అని ఉపన్యాసాలు ఇస్తున్నారని, చంద్రబాబు రెయిన్‌గన్స్‌ ప్రయోగించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క చుక్క వర్షం కూడా పడలేదన్నారు. వేసవికాలం తాగునీటి ఇబ్బందులపై ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వెయ్యి గ్రామాలకు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇవన్నీ గుడ్డి ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్‌ను ముట్టడి చేస్తామనగానే వందలమంది పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసిందన్నారు. నియోజకవర్గ ప్రజల తాగునీటి ఇబ్బందులపై చర్యలు చేపట్టకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాగునీటి సమస్యపై నిరసనకు దిగిన ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు, 300 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top