బాబు తెలంగాణకు వెళ్లిపోతే దరిద్రం పోతుంది

చంద్రబాబు వస్తే కరువు వస్తుందని ఆయనే అంగీకరించాడు
ఏపీలో కరువు ఉందని మొట్ట మొదటిసారి బాబు నిజం చెప్పాడు
నష్టపోయిన రైతులను ఏ విధంగా ఆదుకున్నారో చెప్పాలి
దేశంలో చక్రం తిప్పడం కాదు.. అవకాశం ఇచ్చిన ఆంధ్రరాష్ట్రం గురించి ఆలోచించు
దోచుకున్న డబ్బును ఇత్రరాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నాడు
కరువు తీవ్రంగా ఉంటే గ్రోత్‌ రేట్‌ ఏ విధంగా పెరిగిందో చెప్పాలి
చంద్రబాబు సుభిక్షం పచ్చ మీడియాలకే పరిమితం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్‌: చంద్రబాబు నాయుడు తెలంగాణకు వెళ్లిపోతే ఆంధ్రరాష్ట్రం దరిద్రం పోతుందని ప్రజలంతా భావిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు పీడ నుంచి ఎప్పుడు విడుదలవుతామని ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. బాబు వస్తే కరువు వస్తుందని ముఖ్యమంత్రే ఒప్పుకున్నారన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బృందం రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలిన చేసి చంద్రబాబు దగ్గరకు వెళ్తే ఏడు సంవత్సరాలు కరువు ఉందని వారితో బాబు మొదటిసారి వాస్తవం చెప్పారన్నారు. బాబు వస్తే కరువు వస్తుందని ఆయనే అంగీకరించాడన్నారు. దాదాపు 13.60 లక్షల హెక్టార్లు (33.60 లక్షల ఎకరాల్లో) పంట నష్టం జరిగిందని, 16.52 లక్షల మంది రైతులు నష్టపోయారని, సాయంగా కేంద్రాన్ని రూ. 14 వందల కోట్లు అడిగినట్లు చెప్పారన్నారు. కానీ సాధారణ వర్షపాతం 556 మిల్లీమీటర్లు, కురిసింది 456 అని చెప్పారని, కానీ వాతావరణ శాఖ రిపోర్టు ప్రకారం జూన్‌ నుంచి డిసెంబర్‌ 5 వరకు కురవాల్సిన వర్షపాతం 831 అయితే కురిసింది 542 ఉందన్నారు. కేంద్రానికి చంద్రబాబు తప్పుడు నివేదిక అందజేశారన్నారు. 

తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని చెబుతున్న చంద్రబాబు రైతులను ఎంతమేరకు ఆదుకున్నారో చెప్పాలని గడికోట శ్రీకాంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వారానికి ఒక మంత్రి మండలి సమావేశం, ప్రతి సోమవారం జలనివేదిక అంటున్న చంద్రబాబు కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకునేందుకు తీసుకున్న చర్చలేంటో చెప్పాలన్నారు. తెలంగాణలో మహాకూటమి పేరుతో ఎన్నికల్లో ఖర్చు చేసే సొమ్మంతా చంద్రబాబుదేనని ప్రజలంతా చర్చించుకుంటున్నారన్నారు. వేలాది కోట్ల రూపాయలను ఏపీ నుంచి తరలించి ఏప్రిల్‌ తరువాత ఎలాగో పంపిస్తారనే భావనతో కాంగ్రెస్‌తో దోస్తీ చేశాడని, ముందస్తుగానే హైదరాబాద్‌లో రూ. 100 కోట్లు ఖర్చు చేసి ఇల్లు కట్టుకున్నాడన్నారు. చంద్రబాబు పీడ ఎప్పుడు వీడుతుందోనని ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. 

ఇన్‌పుట్‌ సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలనే ఆలోచన కూడా చంద్రబాబుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. దేశంలో అత్యధిక అప్పులు ఉన్న రైతులు ఏపీలో ఉన్నారని నాబార్డు నివేదిక చెప్పింది. వ్యవసాయ రంగంలో ఏపీ దయనీయస్థితిలో ఉందని రిపోర్టులో ఉందన్నారు. రాష్ట్రంలో పాలన గాలికొదిలేసి రైతులను పట్టించుకోకుండా దేశవ్యాప్తంగా పర్యటనల పేరుతో చంద్రబాబు దుబారా ఖర్చు చేస్తున్నాడని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. దేశమంతా తిరుగుతూ ఏదో చేస్తున్నట్లుగా ప్రజలను మభ్యపెడుతున్నాడని విరుచుకుపడ్డారు. కేంద్రానికి నివేదిక ఇచ్చిన రోజు వ్యవసాయరంగంలో ఏపీ గ్రోత్‌ 17.8 శాతం ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా 3.8 ఉంటే ఏపీలో మాత్రం 17.18 శాతం ఉందని, పరిశ్రమల్లో దేశ మొత్తంలో 6.8 శాతం  ఉంటే ఏపీ 9.68 శాతం గ్రోత్‌లో ఉన్నామని, సేవా రంగంలో 7.5 నేషనల్‌ ఏవరేజ్‌ అయితే స్టేట్‌లో 9.17 గ్రోత్‌ చేశామంటూ తప్పుడు లెక్కలతో ప్రజలను వంచిస్తున్నాడన్నారు. ఐదేళ్ల నుంచి కరువు ఉందని చెప్పిన చంద్రబాబు గ్రోత్‌ రేట్‌ ఎలా పెరిగిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. లెక్కలను ఏ విధంగా తారుమారు చేయడం, ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబు దిట్ట అని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. 

అనుబంధ రంగాలన్నింటినీ తీసుకొచ్చి వ్యవసాయంపై కలుపుతూ వృద్ధి రేటు పెరిగిందంటూ డాంబికాలు పలుకుతున్నాడని చంద్రబాబుపై శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కరువు తీవ్రంగా ఉందన్నారు. చిత్తూరులో –42, కడప –60, అనంతపురం –47, కర్నూలు –50, నెల్లూరులో –53, ప్రకాశంలో –57.6 వర్షపాతం ఉందన్నారు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలు మినహా అన్ని జిల్లాలో కరువు తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఖరి చూస్తే పిల్లలకు చేప, రొయ్యల కథలు చెప్పుకోవాలన్నారు. కృష్ణా పుష్కరాలకు రూ. 3 వేల కోట్లు, గోదావరి పుష్కరాలకు రూ. 3 వేల కోట్లు అంటూ హంగు ఆర్భాటాలకు వేల కోట్లు దోచుకున్నాడని గడికోట మండిపడ్డారు. చంద్రబాబు ఫైనాన్స్‌ చేస్తేనే తెలంగాణలో కూటమి ప్రచారం నడిచే స్థాయికి వచ్చిందంటే ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. చంద్రబాబు ఇచ్చే డబ్బు కోసం రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నేతలు ఎదురుచూశారన్నారు. ఏపీలో కరువు పరిస్థితులు దుర్మార్గంగా ఉంటే తెలంగాణకు వెళ్లి ఏపీని బ్రహ్మాండంగా చేశానని ప్రకటనలు ఇస్తున్నాడని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 

మొన్నటి వరకు హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టింది నేనే అంటూ డాంబికాలు చెప్పుకున్న చంద్రబాబు స్వరం మార్చి సైబరాబాద్‌ ఒక్కటే నిర్మించానని చెప్పుకుంటున్నాడన్నారు. 1990లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సైబరాబాద్‌ను నిర్మించారని శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం తన మనుషులను రియలెస్టేట్‌ వ్యాపారులుగా మార్చి అభివృద్ధి చేశానని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ ముందు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నిర్మించింది తానేనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎయిర్‌పోర్టు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసింది సోనియాగాంధీ అని మర్చిపోయారా చంద్రబాబూ అని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా చక్రం తిప్పుతానని మాట్లాడుతున్న చంద్రబాబు టీడీపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రాహుల్‌తో చేయి కలిపారని, కలిసి పనిచేయడం కంటే పార్టీనే కాంగ్రెస్‌లో కలిపితే బాగుండేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పే సుభిక్షం పచ్చమీడియాల్లో మాత్రమే కనిపిస్తుందన్నారు. చక్రం తిప్పడం మాట పక్కనబెట్టి సీఎంగా అవకాశం ఇచ్చిన ఆంధ్రరాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలని సూచించారు. 
Back to Top