– ఎన్నికల అధికారి సిసోడియాకు వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు– ఓటరు నమోదు గడువు పెంచాలని వినతి– ఏపీలో 60 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ఫిర్యాదు– వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లే తొలగిస్తున్నారు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, ఇందులో ఎక్కువ శాతం వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లే తొలగించారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై వైయస్‌ఆర్‌సీపీ నాయకులు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియాకు ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తనకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను భారీగా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించారు. తన ఆధీనంలో ఉన్న వ్యవస్థలు పల్స్ సర్వేలను ఉపయోగించుకుని ఓట్లు తొలగిస్తున్నారు. ఇటీవల ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని ప్రశ్నలు అడుగుతూ..చంద్రబాబు పాలన సరిగా లేదని చెబితే అలాంటి వ్యక్తుల ఓట్లు తొలగించే ప్రక్రియ జరుగుతుందన్నారు. డూప్లికెట్ ఓట్లను భయంకరంగా చేర్చుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో 40 లక్షల ఓట్లను తొలగించారని, వైయస్‌ఆర్ జిల్లాలో 4 లక్షల ఓట్లు, కర్నూలులో 6.31 లక్షలు, చిత్తూరులో 4 లక్షల ఓట్లు తొలగించారని వివరించారు. తన పేరు కూడా సత్తనపల్లి నియోజకవర్గంలో తొలగించారని చెప్పారు. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తే మళ్లీ చేర్చారని గుర్తు చేశారు. రేపటి ఎన్నికల్లో ప్రజాబలం లేకపోయినా ఇలాంటి డూప్లికెట్ ఓట్లతో గెలవాలని చంద్రబాబు రెవెన్యూ యంత్రాగాన్ని ఉపయోగించుకుని జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అధికారికి ఉన్న సమాచారం ప్రకారం 3 లక్షల డూప్లికెట్ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించే కార్యక్రమం చేపడుతామని, నమోదు గడువు పెంచడం సాధ్యం కాదని సిసోడియా చెప్పినట్లు అంబటి రాంబాబు తెలిపారు. నిరంతరం ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నిజమైన ఓటర్ ఓటు వేసే విధంగా వైయస్‌ఆర్‌సీపీ కృషి చేస్తుందన్నారు. నిజమైన ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నదే వైయస్‌ఆర్‌సీపీ ధ్యేయమన్నారు. రెండు ఓట్లు వేసే పద్ధతి లేకుండా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండు చేస్తుందని చెప్పారు.