రాష్ట్రంలో 35 లక్షలకు పైగా నకిలీ ఓట్లు

ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు గురువారం భేటీ అయ్యారు. ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సర్వేల పేరుతో టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి వైయ‌స్ఆర్‌సీపీ  సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని కమిషనర్‌కు వివరించారు. ఓట్లు తొలగించబడిన ప్రతి ఒక్కరికీ ఓటు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో ఉన్న అన్ని తప్పులను క్షుణ్ణంగా పరిశీలించి సరిదిద్దాలని వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల కమిషనర్‌ను కలిసిన అనంతరం విజయసాయి రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఏపీలో ఒకే వ్యక్తి పేరుతో నాలుగు, ఐదు ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. సుమారు 35 లక్షలకు పైగా నకిలీ ఓట్లు ఏపీలో ఉన్నాయని స్పష్టం చేశారు. మరో 18 లక్షల మందికి ఏపీ, తెలంగాణాలో రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని వివరించారు. ఓటర్‌ కార్డును ఆధార్‌ కార్డుతో లింక్‌ చేయాలని సూచించారు. ప్రజాప్రాతినిథ్య చట్టానికి సవరణలు తీసుకురావాలి లేదంటే ఆర్డినెన్స్‌ చేయాలని కోరారు. చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లను నమోదు చేయించారని ఆరోపించారు. వైయ‌స్ఆర్‌సీపీ బృందంలో ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, సీనియర్‌ నేతలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ, వరప్రసాద్‌, మిథున్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు.





Back to Top