టీడీపీ నేతలను తక్షణం అరెస్టు చేయాలి

హైదరాబాద్, నవంబర్ 26: అక్రమ మద్యం కేసులో నిందితుడైన కర్నూలు జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ గౌడ్, మాచర్లలో ఒక హత్య కేసులో నిందితునిగా ఉన్న టీడీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ను తక్షణం అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పాలనలో ఇలాంటి అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ వారు పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని, వారిపై ఎలాంటి చర్యలు ఉండటం లేదని తెలిపారు.

వైఎస్సార్సీపీకి చెందిన నేతలను పనిగట్టుకుని కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మున్సిపల్ సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడే యత్నం చేసిన నంద్యాల ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డిని అడ్డుకుని టీడీపీ వారు రభస సృష్టించారని తెలిపారు. టీడీపీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. భూమా నాగిరెడ్డిని, పలువురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మాత్రం కేసుల్లో ఇరికించారని విమర్శించారు. సరస్వతీ సిమెంట్స్ భూముల విషయంలో ఆక్రమణలను వ్యతిరేకించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూడా అక్రమంగా కేసులు పెట్టారని చెప్పారు.

సరస్వతీ సిమెంట్స్ లో శ్రీమతి వైఎస్ భారతి డైరెక్టర్ గా ఉన్నారనే కారణంతోనే ఇలా చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ ధర కన్నా ఎక్కువ చెల్లించి ఎప్పుడో కనుగోలు చేసిన భూముల్లో తిరిగి సేద్యం చేసుకోవాలని టీడీపీ వారు రైతులను రెచ్చగొడుతున్నారని, వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు బేఖాతరు చేస్తున్నారని అన్నారు. కానీ, టీడీపీకి చెందిన కర్నూలు జెడ్పీ చైర్మన్ అక్రమ మద్యం కేసులో 5వ నిందితునిగా ఉన్నా పోలీసులు కనీసం తాకనైనా తాకరని విమర్శించారు.

రాజశేఖర్ గౌడ్ మంత్రులు, ఉన్నతాధికారుల పక్కన కూర్చుని మీడియా సమావేశాలు నిర్వహించినా కూడా అరెస్టు చేయడం లేదని అన్నారు. ఇదేమి అరాచకమని, ఇదేమి న్యాయమని అన్నారు. టీడీపీ వారికైతే ఒక న్యాయం, వైఎస్సార్సీపీ నేతలకైతే మరో న్యాయమా అని ప్రశ్నించారు.

శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై అవాకులు, చవాకులు పేలుతున్న మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఒక మనిషి లాగా మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఆయన మాట్లాడే తీరు చూస్తే ఎవరో తరుముకొస్తున్నారనే భయం కనిపిస్తుందని, ఆయన మానసిక వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిదని సూచించారు. అసలు ఒక మహా పాతకం నుంచి పుట్టిన నాయకుడు ఉమామహేశ్వరరావు అని, ఆ పాతక భయం ఆయన్ని వెంటాడుతున్నందునే అలా అసహజంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

వైఎస్సార్సీపీని మూసేస్తారని మంత్రి పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఒక పార్టీని స్థాపించిన వ్యక్తిని నిలువునా చంపి ఆ పార్టీని లాక్కున్న చరిత్ర టీడీపీ నేతలదని పద్మ చెప్పారు. అందుకే టీడీపీని పదేళ్లపాటు ప్రజలు అడ్రస్ లేకుండా చేశారని అన్నారు. పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన వారు శ్రీ జగన్ గారిపై విమర్శలు చేయడం తగదన్నారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎదిరించి సీబీఐ కత్తిని గుండెలపై పెట్టినా బెదరకుండా వైఎస్ ఆశయాల సాధన కోసం పార్టీ పెట్టిన శ్రీ జగన్ గారికి దానిని ఎలా కాపాడుకోవాలో తెలుసునని చెప్పారు. అసలు వైఎస్సార్సీపీ అంటే అధికారంలో ఉన్న వారు ఎందుకంత భయంతో గంగవెర్రులెత్తి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

Back to Top