సత్వరమే తుపాను సాయం అందించండి

న్యూఢిల్లీ, నవంబర్ 09: హుద్-హుద్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన మూడు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలను ఆదుకునేందుకు సత్వర సాయం అందించాలని కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ కు వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుపాను సహాయక చర్యలకు అవసరమైన నిధులను వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తుపాను బాధితులకు కేంద్ర సాయం అర్ధిస్తూ పార్టీ ఎంపీలతో కలసి రెండు రోజుల పర్యటన కోసం శనివారం ఢిల్లీకి వచ్చిన శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు ఆదివారం కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమరనాథ్ లతో కలసి మధ్యాహ్నం 3:45 గంటలకు ఇక్కడి అశోకారోడ్డులోని రాజ్ నాథ్ నివాసానికి చేరుకున్నారు. దాదాపు అరగంటకుపైగా ఆయనతో భేటీ అయ్యారు.

హుద్-హుద్ తుపాను కారణంగా జరిగిన నష్టం, బాధితులకు సాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్రం నుంచి రావాల్సిన సాయం తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు. అన్ని అంశాలను పేర్కొంటూ ప్రతినిధి బృందం తరపున కేంద్ర హోంమంత్రికి ఓ వినతి పత్రాన్ని అందచేశారు. అనంతరం రాజ్ నాథ్ నివాసం వద్ద శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

"హుద్-హుద్ తుపాను నష్టానికి సంబంధించిన సహాయ కార్యక్రమాల గురించి కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి ఇచ్చిన లేఖనే.. విపత్తు సహాయక చర్యలకు సంబంధించిన మంత్రి కూడా అయిన రాజ్ నాథ్ గారికి ఇచ్చాం. ఉత్తరాంధ్రలోని చాలా గ్రామాల్లో ఈ రోజుకి కరెంటు రాని పరిస్థితి ఉందని, సహాయ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో సాగటం లేదని అన్ని విషయాలు వివరిస్తూ వినతిపత్రం ఇచ్చాం" అని తెలిపారు.

బాధితులకు ప్రభుత్వ సాయం సున్నా..

'గతంలో ఏ ప్రభుత్వం చేయనంత త్వరగా హుద్-హుద్ తుపాను బాధితులకు సహాయక చర్యలు అందించామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు కదా..? అని ప్రశ్నించగా.. "ఒక్కసారి ఉత్తరాంధ్రకు పోయి చూస్తే, ఎంత గొప్పగా చేశారో అర్ధమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మీడియాలో ప్రచారం తప్ప చేసిందేమి లేదు. ఈ రోజుకీ ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లి చూస్తే కనీసం విద్యుత్ అందించలేని పరిస్థితి ఉంది. తుపాను బాధిత గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాయం సున్నా. రూపాయికి కిలో ఇచ్చే బియ్యం 25 కేజీల చొప్పున ఇచ్చారు. అది కూడా అన్ని గ్రామాల్లో అందరికి ఇవ్వలేదు.." అని జగన్ విమర్శించారు.

అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో పోరాడుతాం..

వైఎస్సార్సీపీ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై మేరేమంటారు అని ప్రశ్నించగా.. "ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమవుతున్నారు.. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా కనిపిస్తుంది.. దీంతో ఆయన భయపడి అక్రమ కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆ కేసులను మేం గట్టిగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉంది. పోరాడి విజయం సాధిస్తాం.. అని శ్రీ వైఎస్ జగన్  బదులిచ్చారు.

సాయంపై వైఎస్సార్సీపీ అభ్యర్థనలు..

•    పంటలు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న రైతులకు పంట రుణాల్ని, వడ్డీల్ని పూర్తిగా రద్దు చేయాలి. నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు వచ్చే సీజన్ సమయానికి అవసరమైన రుణాలు కొత్తగా ఇవ్వాలి.
•    తుపాను బాధిత ప్రాంతాల్లోని స్వయం సహాయక గ్రూపులకు ఎటువంటి వడ్డీ లేకుండా రుణాలు రీషెడ్యూల్ చేయాలి.
•    వ్వచ్చే రబీకి అవసరమైన విత్తనాలు సర్కారే ఉచితంగా అందించాలి.
•    రైతులందరికీ పంట బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలి.
•    పాక్షికంగా దెబ్బతిన్న వరి, చెరకు, ఉద్యానవన ఉత్పత్తులు సర్కారే సేకరించేందుకు హామీఇవ్వాలి.
•    హుద్-హుద్ తుపాను సందర్భంగా అక్టోబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 9,10,11,12,13,15 జీవోల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా దానికి ఆదేశాలివ్వాలి.
•    భూపేందర్ సింగ్ హుడా కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కౌలు రైతుల్ని కలుపుకొని ప్రతి రైతుకు ఎకరానికి రూ.10 వేలకు తగ్గకుండా ప్రకృతి విపత్తు సహాయనిధి సాయమందించాలి.
•     చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రూ. 5 లక్షల పరిహారం వెంటనే అందేలా చర్యలు చేపట్టాలి.
•    ఇల్లు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ. 50వేల ఆర్ధిక సాయమందించాలి. ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి శాశ్వత పరిష్కారం కింద పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.
•    ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం పశువులు చనిపోయినవారికి, కోళ్లు చనిపోయిన కోళ్ల ఫారాల వారికి పరిహారం అందజేయాలి.
•    తుపాను బాధిత ప్రాంతాల్లోని వారికి రేషన్ ద్వారా అతి తక్కువ సాయం చేసినందున ప్రతి ఇంటికీ రూ. 5 వేలు ఆర్ధిక సాయమివ్వాలి.
•    బోట్లు, వలలు నష్టపోయిన మత్సకారులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలి.
•    వరద బాధిత ప్రాంతాల్లో భూమికోత అరికట్టేందుకు, పూడికతీతకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలి.

పనిచేసే వారిపై బురద చల్లుతున్నారు..

 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ నేతలకు మంత్రి పదవులు ఇప్పించుకోవడంపై చూపుతున్న శ్రద్ధ, తుపాను బాధితులను ఆదుకునే విషయంలో పెట్టడం లేదని శ్రీ వైఎస్ జగన్ విమర్శించారు. బాబు తన పార్టీ నేతలకు పదవులు ఇప్పించుకోవడానికి ప్రధానితో మాట్లాడుతున్నారే కానీ.. ప్రజా సమస్యలపై ప్రధానిని కలవడం లేదని ఎండగట్టారు. "ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు ఇంతవరకు ప్రధానిని కలిసి తుపాను సాయానికి సంబంధించి అభ్యర్ధించింది లేదు. మంత్రివర్గంలోకి సుజనాచౌదరిని ఎలా తీసుకుపోవాలన్నదానిపై మోదీ గారితో ఫోన్లో మాట్లాడినట్టు చెప్పుకుంటున్నారు. ఆ ధ్యాస, ఆ శ్రద్ధ.. తుపాను బాధితులపై పెట్టి ఉంటే కనీసం రాష్ట్రానికి మంచి జరిగేది. చంద్రబాబు, ఆయన మంత్రి వర్గ సహచరులు చిత్తశుద్ధితో పనిచేయరు. పనిచేసేవారిపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు" అని ఆయన తూర్పారబట్టారు.

తాజా వీడియోలు

Back to Top