కీల‌కంగా మారుతున్న వైయ‌స్సార్సీపీ

హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ లోని కేంద్ర కార్యాల‌యంలో తెలంగాణ పార్టీ స‌మీక్ష స‌మావేశాలు చురుగ్గా సాగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్ జిల్లా కమిటీల సమీక్షా సమావేశం జరిగింది. దీనికి అధ్య‌క్షులు గ‌ట్టు శ్రీకాంత్ రెడ్డి నాయ‌క‌త్వం వ‌హించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వైయ‌స్సార్ సీపీ ప్రధాన భూమిక పోషించనున్నదని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. మండలానికి కనీసం 50 మందిని క్రియాశీలక, సుశిక్షితులైన కార్యకర్తలను తయారు చేసుకోవాలని సూచించారు.

ప్ర‌జ‌ల మ‌నిషి వైయ‌స్ జ‌గ‌న్‌
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న తీరును ఆయన వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు ఎన్ని కుయుక్తులు ప్రదర్శించిన అధికారంలోకి రాలేడన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు మహానేత వైఎస్సార్ పాలను చంద్రబాబు, కేసీఆర్ పాలనను పోల్చి చూసుకుంటున్నారని తెలిపారు. ఏపీలో ఐదు లక్షల ఓట్ల తేడాతో వైఎస్సార్‌సీపీ అధికారానికి దూరమైందని, తెలంగాణలో చాలా తక్కువ ఓట్లతో కొన్ని అసెంబ్లీ సీట్లను చేజార్చుకున్నామన్నారు. ఈ సరళి ప్రకారం అంచనా వేసినా పార్టీగా కష్టించి సమైక్యంగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ప్రధాన భూమిక పోషిస్తామని చెప్పారు. నగరంలోని 150 డివిజన్లలోనూ, రాష్ట్రంలోని అన్ని మండలాల్లోనూ త్వరగా కమిటీల ప్రక్రియ పూర్తి చేయాలని, ప్రజా సమస్యలను గుర్తించి దశలవారీ పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు.  ఇద్దరు సీఎంల పాలను అసహ్యించుకుంటున్నారని చెప్పారు.

గ్రేట‌ర్ అంటే గుండెకాయ‌
 గ్రేటర్ హైదరాబాద్ అందరికి గుండెకాయ లాంటిదన్నారు. ఇక్కడ 23 జిల్లా వాసులు నివాసం ఉంటున్నారని తెలిపారు. కేంద్ర కార్యాలయం ఉన్న ప్రాంతంలో ఇదని గుర్తుచేశారు. ఇక్కడ బలంగా ఉంటే రెండు రాష్ట్రాల్లో బలంగా ఉన్నట్లేనని చెప్పారు. సంస్థాగతంగా పార్టీ కమిటీలు పూర్తి చేసి, జనంలోకి వెళ్లి, జనం మధ్య ఉండాలని తెలిపారు. త్వరలోనే భారీగా నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో భారీగా సభను నిర్వహిద్దామన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న ప్రాంతం, రాష్ట్రంలో బలోపేతంగా ఉంటే మరో ప్రాంతంలో బలపడేందుకు ఒక శక్తిగా ఉపయోగపడుతుందన్నారు. పార్టీని నగరంలో పెద్ద ఎత్తున బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

 ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జి. మహేందర్ రెడ్డి, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎ.కుమార్, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్యామల, నాగదేశి రవికుమార్, రైతు విభాగం అధ్యక్షుడు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

 
Back to Top