15 రోజుల్లో తుపాను బాధిత ప్రాంతాలకు వైయ‌స్ జగన్‌

విజ‌య‌న‌గ‌రం: ఉద్దానం సహా తుపాను సంభవించిన అన్ని ప్రాంతాల్లో పర్యటించి బాధితులను కలుస్తానని వైయ‌స్‌ జగన్‌ భరోసా ఇచ్చారని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ధర్మాన ప్ర‌సాద‌రావు తెలిపారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో తుపాను పీడిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత పర్యటిస్తూనే ఉన్నారని వివరించారు. ‘తిత్లీ తుపాను వల్ల రూ.3435 కోట్ల నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కేంద్రం జాతీయ విపత్తుగా గుర్తించనందున రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే బాధితులకు పరిహారం చెల్లించాలి. మీకు (రాష్ట్ర ప్రభుత్వానికి) ఇంకో 15 రోజుల సమయం ఉంది. తూతూమంత్రంగా పరిహారం ఇచ్చి పారిపోవాలని చూస్తే ఊరుకోం. ఆ వెనుకనే ప్రతిపక్ష నాయకుడు వస్తారు. అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మీరు విడిచి పెట్టేసిన కార్యక్రమాలకు ఆయన (జగన్‌) కచ్చితంగా స్పందించి భరోసా కల్పిస్తారు.

మా పార్టీ నియమించిన సీనియర్‌ నాయకుల కమిటీ తుపాను ప్రభావిత గ్రామాలన్నింటిలో పర్యటిస్తుంది. ఇప్పటికే గుర్తించిన లోపాలను జగన్‌ దృష్టికి తెచ్చాం. ఇప్పటికీ విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. మెటిరియల్‌ లేకుండా మనుషులుంటే ఉపయోగం ఏమిటి? విద్యుత్‌ లేక గ్రామాలకు మంచినీరు అందడం లేదు. జనరేటర్లు ఏర్పాటు చేయడంతోపాటు ఊరికో ట్యాంకర్‌ అందుబాటులో ఉంచాలి. తుపాన్‌ వెళ్లిపోయిన పది రోజుల తర్వాత కూడా మంచినీళ్లు ఇవ్వలేకపోవడం అవమానకరం. దోపిడీకి అలవాటుపడ్డ అధికార పార్టీ కార్యకర్తలను నిరోధించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం. ఈ ముఠాలను యథేచ్ఛగా వదిలితే తుపాను బాధితుల సాయాన్నీ కొల్లగొట్టే ప్రమాదం ఉంది. టీడీపీ పాలనతో ఇతర పార్టీలకు చెందిన బాధితులను ఒక పద్ధతి ప్రకారం విస్మరిస్తూ సాయం అందకుండా చేయడం జరుగుతోంది. దీనిపై వైయ‌స్ఆర్‌సీపీ బాధితులకు అండగా నిలిచి పెద్దఎత్తున పోరాటం చేస్తుంది. వైయ‌స్ఆర్‌సీపీ తరపున ప్రకటించిన కోటి రూపాయల సాయంతో బాధిత కుటుంబాలకు వస్తువులు అందచేస్తాం. బాధితులకు సర్కారు సాయం చేయకపోతే వెనువెంటనే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారనేది ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిదైతే ప్రజలకు ఒక ఊరట, ఒక భరోసా లాంటిది’ అని ధర్మాన పేర్కొన్నారు. 
Back to Top