పీలేరులో సిఎం అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు

హైదరాబాద్ :

సొంత నియోజకవర్గంలో‌ సిఎం కిరణ్ కుమార్‌ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఫిర్యాదు చేసింది. పీలేరు మేజ‌ర్ పంచాయతీ పరిధిలో అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గెలుపోటములను తారుమారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు గట్టు రామచంద్రరావు, బి.శివకుమార్, పుత్తా ప్రతా‌ప్‌రెడ్డి, ఆదం విజయ్‌కుమార్‌లు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. 26 వేల ఓటర్లున్న పీలేరు పంచాయతీలో అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అడ్డదారి ప్రయత్నాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 31న జరిగే మూడవ విడత ఎన్నికల్లో ఓట్ల కౌంటింగ్‌ను రౌండ్ టేబు‌ల్ విధానం కాకుండా బ‌ల్కు కౌంటింగ్‌కు ప్రయత్నాలు చేస్తున్నారని రమాకాంత్‌రెడ్డి దృష్టికి వారు తీసుకువచ్చారు.

ఈ విధానం ద్వారా పోలైన ఓట్లను గల్లంతు చేసే అవకాశం ఉంటుందని, దీంతో గెలుపోటములు తారుమారయ్యే ప్రమాదం ఉందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడంతో అధికారులను బెదరిస్తున్నారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ తతంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టడంతో‌ పాటు భౌతిక దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఎన్నికల కమిషనర్‌కు వివరించారు.

పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో భాగంగా మంగళవారం ఎన్నికలు జరిగిన చిత్తూరు జిల్లాలోని రేణిగుంట పంచాయతీ కౌంటింగ్ ప్రక్రియను రాత్రయినా ప్రారంభించకపోవడంపై అక్కడి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాధపై ఫిర్యాదు చేశారు. కరెంటు లేకుండా చేసి ఓట్ల లెక్కింపును తారుమారు చేసే పరిస్థితిని సృష్టిస్తున్నారని‌ తమ ఫిర్యాదులో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top