పంచాయతీల్లో 'మేజర్' వైయస్ఆర్‌ కాంగ్రెస్

హైదరాబాద్ :

ఏకగ్రీవాల్లోనూ, తొలి విడత పంచాయతీ ఎన్నికలలోనూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మద్దతుదారుల ఆధిక్యతకు దరిదాపుల్లో కూడా లేని అధికార కాంగ్రె‌స్, ప్రతిపక్షం టిడిపిలు మలి విడత పోలింగ్‌లో కుమ్మక్కు కుట్రలకు మరింతగా పదునుపెట్టాయి. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హవాకు ఎలాగైనా అడ్డుకట్ట వేయకపోతే తమ మనుగడే పూర్తిగా ప్రశ్నార్థకం అవుతుందనుకున్న ఆ రెండు పార్టీలూ విచ్చలవిడిగా డబ్బును వెదజల్లాయి. కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడ్డాయి. ఆ రెండు పార్టీలూ పోటీలో ఉన్న చోట్ల ఒకరు బలంగా ఉంటే మరొకరు వారికి మొగ్గుచూపేలా ఒప్పందం కుదుర్చుకుని లెక్క సరిచూసుకున్నాయి. మరికొన్ని చోట్ల పరస్పర అవగాహనతో ఉపసంహరణలు, నామమాత్రపు పోటీల ఆట కూడా ఆడాయి.

రెండవ దశ పోలింగ్‌ జరిగిన 22 జిల్లాలకు గాను మొత్తం 7 జిల్లాల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు మొదటి స్థానంలో నిలిచారు. మరో మూడు జిల్లాల్లో గెలిచిన పార్టీ సర్పంచ్ ల సంఖ్య రెండవ స్థానంలో ఉంది. వైయస్ఆర్‌ జిల్లాలో 106 స్థానాల్లోను, కర్నూలు జిల్లాలో 94 చోట్ల, తూర్పుగోదావరిలో 96 స్థానాల్లో, పశ్చిమగోదావరి జిల్లాలో 79 చోట్ల, ప్రకాశం జిల్లాలో 126 పంచాయతీల్లో, నెల్లూరు జిల్లాలో 77 స్థానాల్లో, ఖమ్మం జిల్లాలో 97 పంచాయతీల్లోను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు మొదటి స్థానంలో నిలిచారు. కాగా చిత్తూరు జిల్లాలో 116, కృష్ణా జిల్లాలో 68, గుంటూరు జిల్లాలో 93 స్థానాలలో పార్టీ మద్దతుదారులు గెలిచి పార్టీని రెండవ స్థానంలో నిలిపారు.

కాగా, రెండవ విడత పోలింగ్‌ జరిగిన మొత్తం 19 మేజర్‌ పంచాయతీలకు గాను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు 7 చోట్ల విజయ దుందుభి మోగించారు. మేజర్‌ పంచాయతీల్లో కాంగ్రెస్, టిడిపిలు చెరో 4 చోట్ల గెలిచి రెండవ స్థానంలో ఉన్నాయి. స్వతంత్రులు 3 చోట్ల, టిఆర్ఎస్‌ ఒక పంచాయతీ గెలుచుకున్నాయి.

అధికార దుర్వినియోగం :
రెండవదశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలు సాధారణ ఎన్నికలను తలదన్నేలా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. అడ్డూ అదుపూ లేని అధికార దుర్వినియోగంతో ‘ఫలితాలు’ తమకు అనుకూలంగా వచ్చేందుకు తీవ్రంగా కృషిచేశాయి. కాంగ్రెస్, టిడిపిలు కొన్నిచోట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్ శ్రేణులు, సానుభూతిపరులపై దాడులకు యత్నించాయి. ఓట్లను తమకు తరలిస్తే మంచి పనులు కట్టబెడతామంటూ కాంట్రాక్టర్లకు తాయిలాలు ఎరవేశాయి. అలాగే తమ వారి ఓట్లను గంపగుత్తగా వేయించకపోతే బకాయి బిల్లులు మంజూరు చేయబోమంటూ చోటామోటా కాంట్రాక్టర్లను బెదరించడం వంటి ఆగడాలతో అధికార పార్టీ నేతలు హల్‌చల్ చేశారు.

‌ఇంత జరిగినా.. రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు గణనీయమైన స్థానాల్లో జయకేతనం ఎగరేయడం విశేషం. మలి దశ ఫలితాల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ 1,334, కాంగ్రె‌స్ 1,964, ‌టిడిపి 1,829, టిఆర్‌ఎస్ 593, ‌సిపిఐ 44, సిపిఎం 79, బిజెపి 59, ఇతరులు 646 సాధించారు. ఏకగ్రీవాలతో కలిపి తొలి, మలి దశ ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ 3,767, కాంగ్రెస్ 4,125, ‌టిడిపి 3,852, టిఆర్‌ఎస్ 1,129, ‌సిపిఐ 50, సిపిఎం 120, బిజెపి 130, ఇతరులు 1,738 స్థానాలు గెలుచుకున్నారు.

పల్లె ఎన్నికలకు వందల కోట్లు.. :
రెండవ దశ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం విచ్చలవిడిగా సాగింది. ప్రతి పంచాయతీకి కనీసం పది నుంచి పదిహేను లక్షలు, ఏమాత్రం ఎక్కువ పోటీ ఉన్నచోట పాతిక వరకు, ప్రతిష్టాత్మకంగా పోరు కొనసాగిన పంచాయతీల్లో కోట్లలో ఖర్చు చేశారని సమాచారం. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో కేవలం 1974 మంది ఓటర్లున్న పోతవరం పంచాయతీ ఎన్నికలో కాంగ్రెస్, టిడిపిల ఉమ్మడి అభ్యర్థి కోట్ల సువార్తమ్మను వైయస్ఆర్‌ కాంగ్రెస్ మద్దతుదారుపై గెలిపించేందుకు ఆ రెండు పార్టీల నేతలు‌ దాదాపు రూ.25 లక్షలకు పైగా వ్యయం చేశారు. పొన్నలూరు మండలంలోని రావలపొల్లు, చెరుకూరు పంచాయతీల్లో కూడా టిడిపి, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థులు బరిలో ‌నిలిచారు. చెరుకూరులో టిడిపి అభ్యర్థి ఆరికట్ల సుబ్బరత్నమ్మకు, రావలపొల్లులో టిడిపి అభ్యర్థి పాలడుగు కోటమ్మకు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది. చిన్న పంచాయతీలైనప్పటికీ రెండు పార్టీలు కలిపి ఒక్కో పంచాయతీకి రూ.30 లక్షల‌ వరకు ఖర్చుపెట్టాయి.

ఓటుకు భలేగా పచ్చనోట్ల గిరాకి ! :
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు మేజర్ పంచాయతీలో‌ ఉన్న 13,600 ఓట్లలో ఒక్కో ఓటుకు రూ.1200 నుంచి రూ.1500 వ రకూ కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులు పంపిణీ చేశారు. అంటే ఒక్కో అభ్యర్థి రూ.2 కోట్లకు పైగానే ఖర్చుచేశారన్నమాట. నిడదవోలు మండలం సమిశ్రగూడెం పంచాయతీని దక్కించుకోవడానికి టిడిపి అభ్యర్థి రూ.60 లక్షల వరకూ ఖర్చుచేశారు. అనంతపురం జిల్లా పరిటాల ఇలాకా పెనుగొండలో జరిగిన తొలివిడత ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పాగా వేయడంతో కంగుతిన్న టిడిపి శ్రేణులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలం రామగిరిలో ఓటుకు రూ. 500 నుంచి రూ. 2,000 వరకు పంచిపెట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రాతిని‌ధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మేజర్ పంచాయతీలో ఓటుకు రూ.1,000 చొప్పున పంపిణీ చేశారు.

మంత్రి తోట 'నర్సింహా'వతారం !:
అధికారపార్టీ నాయకులు, సాక్షాత్తూ మంత్రులే అనేక చోట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్ శ్రేణులపై బెద‌రింపులకు పాల్పడ్డారు. మంత్రి తోట నర్సింహం తూర్పుగోదావరి జిల్లాలోని తన సొంత గ్రామం వీరవరంలో తన భార్య వాణిని గెలిపించుకునేందుకు అనుచరులతో కలిసి వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఏజెంట్లను అంతుచూస్తానంటూ దుర్భాషలాడారు. వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ ఏజెంట్లను గెంటేయా‌లని ఏకంగా పోలీసులనే ఆయన ఆదేశించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ మద్దతుదారు తోట సత్యవతి నుంచి గట్టి పోటీ ఎదురవడంతో మంత్రి తోట తీవ్ర అసహనంతో బెదరింపులకు దిగారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఏజెంట్లకు జనర‌ల్ పా‌స్‌లు ఇవ్వడంపై అధికారులపై విరుచుకుపడ్డారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ మద్దతుదారులను తన్ని తరిమేయండంటూ మంత్రి ఆవేశంతో ఊగిపోవడం చూసి అక్కడున్న ఓటర్లు ‌కూడా విస్తుపోయారు. అధికార దర్పం ప్రదర్శించడంతో సరిపెట్టకుండా ఒక్కో ఓటరుకు వెయ్యి రూపాయల వరకు మంత్రి అనుచరులు అందజేశారు.

గెలిచినా.. ఫలితం తారుమారు..‌ :
టిడిపి నేతలైతే పోలీసులపైనే వీరంగం వేశారు. డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్న అనంతపురం జిల్లా ఉరవకొండ టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, రెచ్చిపోయిన కేశ‌వ్ ఎస్‌ఐ శ్రీరాంపై చెప్పుతో దాడి చేసేందుకు యత్నించారు. ఈ విషయంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అండతోనే కేశవ్ ఇలా రెచ్చిపోయారన్నది బహిరంగ రహస్యం. శనివారం బెళుగుప్ప మండలం జీడిపల్లిలో తొలుత వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ అభ్యర్థి మూడు ఓట్ల మెజార్టీతో గె‌లిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కానీ.. కేశవ్ ఒత్తిళ్లకు తలొగ్గి రీకౌంటింగ్ చేసి.. చివరకు ‌టిడిపి అభ్యర్థి నెగ్గినట్లు తేల్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

గుంటూరు జిల్లా తాడికొండ మాజీ సర్పంచ్, వైయస్ఆర్‌ కాంగ్రెస్ ‌నాయకుడు మహ్మద్ ముస్తాఫాను గృహ నిర్బంధం చేసిన పోలీసులు ‌టిడిపి, కాంగ్రెస్ ‌నాయకులను వదిలేయడంతో వారు పోలింగ్ కేంద్రాల వద్ద యథేచ్ఛగా తిరిగారు.  అభ్యర్థులను బరిలోకి దించకుండా ఇరు పార్టీలూ పరస్పర‌ సహకారంతో కొన్నిపంచాయతీలు సాధించుకున్నాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట మేజర్ పంచాయతీలో వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ గాలి వీస్తుండటంతో అక్కడ ‌టిడిపి అభ్యర్థిని నిలపకుండా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చింది. ఇక్కడ ఈ రెండు పార్టీలు కలిసి ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురిచేశాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం పి.దొంతమూరు పంచాయతీ ఎన్నికల్లో ‌టిడిపి నియోజకవర్గం ఇన్‌చార్జి ఎస్.వి.ఎస్.వర్మ తల్లి శ్రీవత్సవాయి పద్మావతి పోటీచేయగా, కాంగ్రెస్ మద్దతుదారు బరిలో ఉన్నప్పటికీ శుక్రవారం రాత్రికి రాత్రే కుమ్మక్కయ్యారు. ఫలితంగా ‌టిడిపి మద్దతుదారు పద్మావతికి వెయ్యి ఓట్లు వస్తే, కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 90 ఓట్లు మాత్రమే రావడం చూస్తే ఈ రెండు పార్టీల కుమ్మక్కు తేటతెల్లమైంది.

ఉమ్మడి అభ్యర్థులు.. పదవుల పంపకం:
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని ఆరు పంచాయతీల్లో కాంగ్రెస్, టిడిపిలు ఉమ్మడి అభ్యర్థులను నిలిపి పరస్పరం పదవులను పంచుకొన్నాయి. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం వెలటూరులో వైయస్ఆర్‌ కాంగ్రెస్ అభ్యర్థిని వెల్లూరు సుజానమ్మ విజయం సాధించడంతో ఉక్రోషం పట్టలేని ‌టిడిపి వర్గీయులు వైయస్ఆర్‌ కాంగ్రెస్ కార్యకర్తలపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయప‌డిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ సిఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో రెండు పార్టీల నేతలు పలుచోట్ల కుమ్మక్కయ్యారు. పూతలపట్టు నియోజకవర్గంలో పదికిపైగా సర్పంచ్ స్థానాల్లో అధికార పార్టీ బహిరంగంగానే ‌టిడిపికి మద్దతిచ్చింది. కొన్ని చోట్ల సర్పంచ్ పదవి ఒక పార్టీకి, ఉప సర్పం‌చ్ మరో పార్టీకి అన్నట్లుగా ఒప్పందాలు కుదిరాయి.

‌రాష్ట్ర రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి కుట్రలు చేసినా వైయస్ఆర్‌ కాంగ్రెస్ మద్దతుదారులు మలి దశలో సైతం విశేష‌ సంఖ్యలో స్థానాలే గెలుచుకున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలిసారిగా జరిగిన స్థానిక సమరమే అయినా క్షేత్రస్థాయిలో బలీయమైన శక్తిగా అవతరించింది.

Back to Top