చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తాం


– సెజ్, షుగర్‌ ఫ్యాక్టరీ సమస్యల పరిష్కారానికి కృషి
– వేతనాలు పెంచాలని బ్రాండెక్స్‌తో మాట్లాడతాం
– సెజ్‌కు బ్రాండెక్స్‌ తెచ్చింది మహానేత వైయస్‌ఆర్‌
–వర్షంలోనే ప్రసంగించిన వైయస్‌ జగన్‌
యలమంచలి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మూతపడిన చక్కెర కర్మాగారాలన్నీ తెరిపిస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. యలమంచలి నియోజకవర్గంలో సెజ్, షుగర్‌ ఫ్యాక్టరీ సమస్యలు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని, నాలుగున్నరేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదన్నారు.  ప్రజా సంకల్ప యాత్ర 244వ రోజు యలమంచలి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.   
– ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. అందుకే మొట్ట మొదట యలమంచలి ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వర్షం కురుస్తున్నా ఎవరూ లెక్క చేయడం లేదు. ఏ ఒక్కరికి నాతో పాటు వర్షంలో తడవాల్సిన అవసరం లేదు. అయినా వేలాది మంది నాతో పాటు అడుగులో అడుగులు వేస్తున్నారు. ఈ నడిరోడ్డుపై నిలబడి నాపై ప్రేమానురాగాలు చూపుతున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.
– ఈ రోజు ఈ నియోజకవర్గంలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటలు నా హృదయాన్ని కలచివేసింది. ఇక్కడ ఎస్‌ఈజెడ్, షుగర్‌ ఫ్యాక్టరీ తదితర సమస్యలు ఉన్నాయి.  వర్షంలో నేను తడిసిన ఫర్వాలేదు. కానీ నాతో పాటు మీరు తడవడం నాకు ఇష్టం లేదు. 
– చక్కెర కర్మాగారానికి సంబంధించి ఆశపెట్టుకున్న ప్రతి రైతుకు చెబుతున్నాను. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఇవాళ ప్రతి ఒక్కరికి మాట ఇస్తున్నాను. జగన్‌ అనే నేను మీ అందరికి మాట ఇస్తున్నాను. చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తాను. మూత పడిన ప్రతి ఫ్యాక్టరీని ఆదుకుంటాను. 
– నేవెల్‌ బేసిక్‌కు సంబంధించిన సమస్యలపై మత్స్యకారులు ఉద్యమాలు చేస్తున్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు బీజేపీతో కాపురం చేశాడు. ఇన్నాళ్లు ఈ సమస్యలు చంద్రబాబుకు గుర్తుకు రాలేదు. ఆ నెవల్‌ భూములు తీసుకుని నష్టపోయిన ప్రతి ఒక్కరికి నేను మాట ఇస్తున్నాను. కేంద్రం ఇచ్చినా, ఇవ్వకపోయినా దగ్గరుండి నేను ఇప్పిస్తాను.
– పక్కనే ఉన్న ఎస్‌ఈజెడ్‌లో ప్రతి పేదవాడికి ఉద్యోగం ఇవ్వాలన్నదే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కల. అక్కడ ఉన్న అక్కచెల్లెమ్మలు చెబుతున్న మాటలు నాకు సంతోషాన్ని ఇచ్చాయి. బ్రాండెక్స్‌ కంపెనీలో 18 వేల మంది అక్కచెల్లెమ్మలు అక్కడ పని చేస్తున్నారు. 25 వేల మంది లబ్ధి పొందుతున్నారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా బ్రాండెక్స్‌ సంస్థతో మాట్లాడి చేయవలసిన మేలు చేయిస్తాం. యాజమాన్యంతో మాట్లాడి వేతనాలు పెంచేలా చర్యలు తీసుకుంటాం. 
– వర్షంలో తడుస్తున్న పరిస్థితిని చూడలేకపోతున్నాను. మీ ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు మరొక్కసారి చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 
 

తాజా వీడియోలు

Back to Top