దొంగచాటుగా మృతదేహాల తరలింపు..చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్..!

రాజమండ్రిః తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఉలిక్కి ప‌డింది. ప్ర‌తిప‌క్ష నేత  వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాలను స్వస్థలాలకు తరలించి నీచ సంస్కృతికి తెరలేపింది. ప్రభుత్వ తీరుపై  వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబుకు ఒక్క క్షణం కూడా కుర్చీలో కుర్చునే అధికారం లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన ప్రభుత్వాన్ని,జెన్ కోను కోర్టుకు లాగుతామన్నారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈసందర్భంగా  బాధితులు జగన్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మృతదేహాలను తమకు చూపించకుండానే తరలించారని వాపోయారు.

పరిహారం ఇవ్వకుంటే కోర్టుకు లాగుతాం..!
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని , గాయపడిన వారికి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలు చెల్లించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పుష్కర బాధితులకు ఇచ్చినప్పుడు కూలీలకు ఎందుకు పరిహారం ఇవ్వరని  జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీ జెన్ కో పవర్ ప్లాంట్ నుంచి వెళ్లిన బూడిద లారీలో కూలీలు ఎక్కారని, అలా ఎక్కించుకోవడం అన్యాయమన్నారు. ప్రమాదానికి కారణమైన జెన్ కో కూడా పరిహారం ఇవ్వాలన్నారు. పట్టిసీమ నుంచి పోలవరం..ఇసుక నుంచి మట్టివరకు అంతా అవినీతేనని చంద్రబాబుపై జగన్ ధ్వజమెత్తారు. ఉపాధి పనులు లేకనే కూలీలు వలసలు పోయి బయట పని చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని జగన్ వాపోయారు. ఉపాధి జరిగే చోట  రూ.30 నుంచి రూ.80 రూపాయలు కూడా గిట్టడం లేదన్నారు. 

బూడిదైన కూలి బతుకులు..!
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వలసకూలీలు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వద్ద ఈతెలవారుజామున బూడిద లారీ ఎక్కారు. గండేపల్లి వద్ద అదుపుతప్పిడంతో బోల్తా కొట్టింది. ఈఘటనలో 19 మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు.    ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని  జగన్ కోరారు. 
Back to Top