విజయనగరంః బహిరంగసభలో దారి ఇప్పించి సురక్షితంగా ఆసుప్రతికి చేరడానికి జగనన్న చేసిన సాయాన్ని జన్మలో మర్చిపోలేమని గర్భిణీ రాజేశ్వరీ,శివ దంపతులు అన్నారు. బహిరంగ సభలో అంతమందిని ఎలా దాటాలో అని ఆందోళన పడుతుంటే వైయస్ జగన్ మైక్‌లో దారి ఇవ్వమని చెప్పడం ఆయనపై గౌరవం మరింత పెరిగిందన్నారు. రాజన్న తనయుడు వైయస్ జగనే స్వయంగా సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఒక బాధ్యత గల నాయకుడిగా జగన్ నిండు మనసుతో చేసిన సాయానికి గర్భిణీ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. నెల్లిమర్లలోని మొయిద జంక్షన్.. బుధవారం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభ జరుగుతోంది. కిక్కిరిసిన జనం.. అడుగేయడమే కష్టం.. మరో వైపు జననేత ఉద్విగ్నభరిత ప్రసంగం సాగుతోంది. అదే సమయంలో చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం ఆనందపురం గ్రామానికి చెందిన గర్భిణి యాల రాజేశ్వరి ఆటోలో ఆ దారిగుండా వెళ్ళాల్సి వచ్చింది. జనం మధ్యలోంచి ఆటో వెళ్ళలేకపోవడాన్ని వేదిక నుంచే గమనించారు జగన్. వెంటనే ప్రసంగాన్ని ఆపేశారు. నిండుచూలాలి బాధ చూసి చలించిపోయారు. వెంటనే ‘అన్నా.. ఆటోకు దారివ్వండన్నా... ’ అంటూ పదేపదే మైక్‌లో చెప్పారు. జననేత అభ్యర్థనతో అప్పటి వరకూ ఆయన ప్రసంగం వింటూ వేలాదిగా గుమిగూడిన అభిమానులు సైనికుల్లా క్రమశిక్షణతో పక్కకు జరిగారు. కొందరు రక్షణ వలయంగా ఏర్పడి ఆటోను ముందుకు నడిపించారు. ఆ క్షణంలో జగన్ మాట్లాడుతూ ‘108 రాక ఆ గర్భిణీ కనీసం ఆటోలో వెళ్తుంది. కొంచెం స్థలం ఇవ్వాలన్నా.. కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. మిమ్మల్నందరినీ కోరుతున్నా. ఇదే నెల్లిమర్లలో ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆటోలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుందంటే 108కి ఫోన్ కొడితే 20 నిముషాల్లో రావాల్సిన అంబులెన్స్ కుయ్.. కుయ్ అనే సౌండ్ వినపడటం లేదంటే.. ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటో వేరే చెప్పక్కర్లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జనాన్ని దాటుకుంటూ వెళ్ళగలమా? సాయం చేసేదెవరని భయంతో ఉన్న గర్భిణి కుటుంబ సభ్యులు ఆ క్షణంలో ఆటోలోంచే జగన్‌కు అభివాదం చేశారు. ‘థ్యాంకూ.. అన్నా.. అంటూ కృతజ్ఞతలు చెప్పారు.