నా బిడ్డను పంపిస్తున్నా....కాపాడుకోండి

  • ప్రజలకు వైయస్ కుటుంబం ఎంతో రుణపడి ఉంది
  • వైయస్ జగన్ కుటుంబంతో కంటే ప్రజలతోనే ఎక్కువగా ఉంటున్నారు
  • ఎన్ని నిందలు వేసినా మౌనంగా భరిస్తున్నాం..
  • కష్టాన్ని ఓర్చుకుని...సంతోషాన్ని పంచుతాం
  • వైయస్ మరణం నుంచే ఇంకా కోలుకోలేదు...
  • నాకు కడుపు కోత విధించవద్దు
  • వైయస్ జగన్ ఆరోగ్యం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు 
  • హత్యా యత్నం ఘటనపై నిష్పక్షపాత విచారణ జరగాలి 
  • పూటకో మాట రోజుకో సాక్ష్యం
  • ప్రజల నుంచి జగన్ ఎవరూ దూరం చేయలేరు
  • నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వడమే కానీ డ్రామాలు చేతకావు - 
  • వైయస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ 



హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజల నుంచి ఎవరూ దూరం చేయలేరని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ అన్నారు. ఎన్ని కష్టాలైనా భరించి ప్రజలకు ప్రేమ పంచే స్వభావం దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిది, వైయస్‌ జగన్‌దని చెప్పారు. వైయస్‌ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగి ఇవాల్టికి 17 రోజులు అయినా ఇప్పటికీ దోషులను తేల్చలేకపోయారని, ప్రతిపక్షనేతపై జరిగిన దాడిపై స్వతంత్ర సంస్థల దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దాడి తరువాత వైయస్‌ జగన్‌ తిరిగి మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. నా బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. రాష్ట్ర ప్రజానీకానికి వైయస్‌ కుటుంబం ఎంతో రుణపడి ఉంది. వైయస్‌ జగన్‌ కోలుకోవాలని, ఆయనకు దేవుడి ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించారు. ఆ కుటుంబాలకు వైయస్‌ఆర్‌ కుటుంబం రుణపడి ఉంటుంది. వైయస్‌ కుటుంబానికి, రాష్ట్ర ప్రజానీకానికి 45 ఏళ్ల అనుబంధం ఉంది. 30 సంవత్సరాలు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని నాయకుడిగా గుర్తించి భుజస్కందాలపై మోశారు. వైయస్‌ఆర్‌ కూడా సీఎం అయిన తరువాత అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. 
 
నాన్న నన్ను ఎప్పుడూ ఒంటరి చేయలేదు. ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయారని వైయస్‌ జగన్‌ ఎప్పుడూ చెబుతుంటారు. వైయస్‌ జగన్‌కు ఇదొక పునర్జన్మ. గొంతులో దిగాల్సిన కత్తి భుజానికి తగిలింది. ప్రజల ప్రేమతో, దేవుడి దయతో తప్పించుకున్నాడు. వైయస్‌ జగన్‌ మళ్లీ తిరిగి పాదయాత్రకు వెళ్తున్నాడు. ఏడు ఏళ్ల కిందట ప్లీనరీ మొదటి మీటింగ్‌లో నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నానని ప్రజలకు చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కుటుంబ సభ్యులతో కంటే ప్రజల మధ్యే ఎక్కువగా ఉన్నారు. పరామర్శ యాత్రకు వచ్చినప్పుడు వైయస్‌ జగన్‌ను అక్కున చేర్చుకొని ఓదార్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సమస్యల్లో, సమైఖ్యాంధ్ర, ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలపై ధర్నాలు, దీక్షలు చేస్తూ కడుపు మాడ్చుకొని పోరాటం చేశారు. 

ఇడుపులపాయ నుంచి వైయస్‌ జగన్‌ 3200ల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. పెట్టని కోటగా జనసంద్రమై వైయస్‌ జగన్‌ను కాపాడుకున్నారు. పెట్టనికోటగా అంటే ఐదు నెలల కింద ఓ వ్యక్తి ప్రతిపక్ష నేతపై ఎటాక్‌ జరుగుతుందని చెప్పాడు. ఆ రోజు నేను చేయగలిగింది ఏమీ లేదు. దేవుడికి ప్రార్థన చేసి ప్రజలకు అప్పగించాను. గుంటూరులో, గోదావరి జిల్లాలో అంతం చేయాలని రెక్కీ జరిగింది. అది వీలుకాలేదని ఎయిర్‌పోర్టును ఎన్నుకున్నారని వింటున్నాను. ప్రజలు ఉన్న చోట వైయస్‌ జగన్‌ను ఏమైనా చేస్తే చేసిన వారు ఉండరు. కాబట్టి ప్రజలు లేని ఎయిర్‌పోర్టును ఎన్నుకున్నారని అనుకుంటున్నాను. 

2009 నుంచి వైయస్‌ఆర్‌ మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత జరిగిన పరిణామాలు చూస్తే వైయస్‌ఆర్‌ కుటుంబంపై నిందలు, నేరారోపణలతో, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నా మౌనంగా భరిస్తున్నాం. తల్లి మీద, చెల్లిమీద, భార్య మీద అందరిపై మాట్లాడుతున్నారు. అయినా మౌనంగా భరిస్తున్నాం, సహిస్తున్నాం. వైయస్‌ఆర్‌ కుటుంబంపై ఎన్నో కుట్రలు చేస్తున్నారు. ఏ కాంగ్రెస్‌ పార్టీకి అయితే వైయస్‌ఆర్‌ జీవం పోసి సేవ చేశారో ఆ పార్టీ వైయస్‌ఆర్‌ను దోషిగా చేసింది. కుటుంబాన్ని ఈ రోజుకు ఏడిపిస్తున్నారు. ఇది కాంగ్రెస్‌ నిరంకుశత్వం, టీడీపీ వికృత చేష్టలు.
 
వైయస్‌ జగన్‌ను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని, సీబీఐ, ఐటీ, ఈడీ అన్ని ఎంక్వైరీలు, రైడ్‌లు, అటాచ్‌మెంట్లు ఇవే కాకుండా 16 నెలలు జైల్లో పెట్టారు. దేశంలో ఏ రాజకీయ నేతపై ఇలాంటి కక్ష సాధింపు చర్యలు జరగలేదు. చంద్రబాబు వ్యవస్థల్లో తన మనుషులను పెట్టుకొని తొమ్మిది సంవత్సరాల తరువాత నా కోడలు భారతమ్మను కూడా ఈడీ దర్యాప్తులో చేర్చాలని చూశారు. ఎన్ని చేసినా వైయస్‌ జగన్‌ దేనికి చలించలేదు. భయపడలేదు, ఎన్ని కష్టాలు ఉన్నా అవన్నీ పక్కనబెట్టి ప్రజల కోసం పోరాడుతున్నారు. ఎవరికీ తల వంచలేదు. తలదించలేదు.
 
ప్రజల నుంచి వైయస్‌ జగన్‌ను ఎవరూ వేరు చేయలేరు. ఇవాల్టికి ఎటాక్‌ జరిగి 17 రోజులు అవుతుంది. దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. చిన్న కత్తే కదా అని డీజీపీ, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇంటలీజెన్స్‌ చీఫ్‌ అంతా మాట్లాడుతున్నారు. పూటకో మాట రోజుకో సాక్షం చూపిస్తూ అసత్య ప్రకటనలు చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులో వీఐపీ లాంజ్‌లో సెక్యూరిటీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది. ప్రతిపక్ష నేతకు రక్షణ ఇవ్వకపోతే ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది. వీఐపీ లాంజ్‌లోకి గుండు సూది కూడా పోలేదు. అటువంటిది ఏ విధంగా కత్తులు వెళ్లాయి. ఎవరు సాయం చేస్తున్నారు. ఎవరి ప్రోద్బలంతో జరిగిందనే ఎంక్వైరీ జరగడం లేదు. ఎయిర్‌పోర్టులో క్యాంటీన్‌ ఓనర్‌ను కూడా తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేశారు. 

ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగిన గంటలోనే డీజీపీ మీడియా ముందుకు వచ్చి ఎందుకు అబద్ధాలు చెప్పారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి వచ్చి చిన్న కత్తి, చిన్న గాయం అంటూ హత్యాయత్నాన్ని చిన్నది చేస్తూ మాట్లాడారు. ఎంక్వైరీ అవసరం లేదని చెబుతున్నారు. అలిపిరి సంఘటన జరిగినప్పుడు చంద్రబాబును ఆస్పత్రికి వెళ్లి వైయస్‌ఆర్‌ పరామర్శించారు. వెంటనే గాంధీ విగ్రహం వద్ద కూర్చొని ధర్నా చేశారు. అది వైయస్‌ఆర్‌ సంస్కృతి. పరిటాల రవి హత్య కేసులో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నానా యాగి చేశారు. కన్న కొడుకుపై ఆరోపణలు వస్తే ధైర్యంగా సీబీఐ ఎంక్వైరీ వేసిన చరిత్ర వైయస్‌ఆర్‌ది. మరి చంద్రబాబు థర్డ్‌ పార్టీతో ఎంక్వైరీ చేయించేందుకు ఎందుకు భయపడుతున్నారు. 

రోజుకో ఫ్లెక్సీ సృష్టిస్తున్నారు. నిందితుడు వైయస్‌ జగన్‌ జగన్‌ అభిమాని అని పోలీసులు, మంత్రులు చెబుతున్నారు. నాలుగు నెలలుగా విశాఖ ఎయిర్‌పోర్టుకు వైయస్‌ జగన్‌ ప్రతి వారం వస్తున్నారు. అభిమాని అయి ఉంటే కలిసిన రోజే గొంతుకు కత్తిపెడతారా..? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు. కేసుపై ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అబద్ధపు లేఖలు సృష్టించారు. పది గంటల తరువాత ముడతలు లేని లెటర్‌ చూపించారు. ఆ లేఖలో ముగ్గురి దస్తూరి ఉందని చెబితే ఎవరెవరో రాశారని చెబుతున్నారు. ఎందుకు అబద్ధాలతో జీవిస్తున్నారు. వైయస్‌ జగన్‌పై జరిగిన దాడిపై నిస్పక్షపాత ఎంక్వైరీ జరగాలి. 

నిస్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగితే ఈ రోజుకు నిందితులు బయటకు వచ్చేవారు. ప్రజలంతా ఏకభవించే ఎంక్వైరీ కావాలి. వైయస్‌ జగన్‌ మళ్లీ పాదయాత్రకు వెళ్తున్నాడు. ప్రజలే దానికి సరైన సమాధానం చెబుతారు. జగన్‌ మళ్లీ జనం కోసం వెళ్తున్నాడు. ఏడేళ్ల క్రితం ఏ విధంగా నా బిడ్డను ఏ విధంగా ప్రజలకు అప్పగించానో.. మళ్లీ ఈ రోజు అప్పగిస్తున్నా. రెండు చేతులు ఎత్తి అభ్యర్థిస్తున్నా.. నా బిడ్డను కాపాడుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే హత్యాయత్నం చేయించారో వారికి కూడా రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నా.. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేయొద్దు. వైయస్‌ఆర్‌ను కోల్పోయి నేను నా కుటుంబం ఇంకా తేరుకోలేదు. మళ్లీ నా కడుపు మీద కొట్టొద్దు. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడలేదు అనుకుంటుంది అలా హత్యాయత్నం చేయించినవారు అనుకోకండి ప్రతి మాటకు దేవుడి దగ్గర అకౌంటబుల్‌ అనేది మర్చిపోవద్దు. 

సమాజానికి పత్రికా ప్రతినిధులు వారధిగా ఉండాలి. నిజంగా నిర్భయంగా చెప్పగలిగినప్పుడే శ్రేయస్కరం. దయచేసి నిజాలు చూపించమని, రాయమని అందరినీ కోరుతున్నాను. గంటలో డీజీపీ ఎందుకు ముందుకు వచ్చారు. ఆ వెంటనే చంద్రబాబు లైన్‌లోకి ఎందుకు వచ్చారు. ఎయిర్‌పోర్టులో వైయస్‌ జగన్‌ దగ్గరకు నిందితుడు సెల్ఫీ కోసం వచ్చి గొంతులో కత్తి దించే ప్రయత్నం చేశాడు. వెంటనే వైయస్‌ జగన్‌ పక్కకు తప్పుకోవడంతో ఆ కత్తి భుజానికి దిగింది. అదే కత్తి గొంతులో దిగి ఉంటే కెరోటెడ్‌ ఆట్రీ కట్‌ అయి æ ప్రాణం పోయేదని డాక్టర్స్‌ చెబుతున్నారు. దాడి జరిగినప్పుడు రక్తస్రావం అవుతుంటే ప్రథమ చికిత్స చేశారు. వైయస్‌ఆర్‌కు, వైయస్‌ జగన్‌కు నాటకాలు ఆడడం రాదు. నమ్మినవారి కోసం ప్రాణం ఇవ్వడమే వారికి తెలుసు. హైదరాబాద్‌కు రావడాన్ని కూడా వెకిలిగా మాట్లాడారు. పడ్డవారు చెడ్డవారు కాదు ఎన్ని మాట్లాడినా ఏం పర్వాలేదు. పోలీసు వ్యవస్థపై విశ్వాసం ఉంది కానీ ప్రభుత్వంపై నమ్మకం లేదు. రోజుకో అబద్ధం, రోజుకో ఫ్లెక్సీ, దొంగ లేఖలు సృష్టిస్తున్నారు. అందుకే ప్రభుత్వ ఎంక్వైరీపై నమ్మకం లేదు. స్వతంత్ర దర్యాప్తు కావాలని కోరామని వైయస్‌ విజయమ్మ చెప్పారు. 
Back to Top