ఈ విషాద ఘటన అయినా రైతు వ్యతిరేక ప్రభుత్వం కళ్లు తెరిపిస్తుందా?

 
18–12–2018, మంగళవారం 
కొబ్బరిచెట్లపేట, శ్రీకాకుళం జిల్లా  
  

ఈరోజు నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ఉదయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కచెల్లెమ్మలు పూజలు చేసి ప్రసాదాలు తెచ్చారు. నిన్నటిలాగే ఈరోజు కూడా మబ్బులు కమ్ముకునే ఉన్నాయి. చలిగాలులు, వర్షపు జల్లుల మధ్యనే పాదయాత్ర సాగింది. నిన్నటి నుంచి పడుతున్న వర్షానికి రోడ్లన్నీ బురదమయమయ్యాయి. వర్షం కారణంగా మధ్యాహ్నం తర్వాత పాదయాత్ర కొనసాగించలేని పరిస్థితి.  

ఒకప్పుడు చల్ల అంటే.. అక్కడి చల్లే అన్నంత పేరు. మజ్జిగకు బాగా ప్రసిద్ధి కావడం వల్ల చల్లవానిపేటకు ఆ పేరు వచ్చిందట. అయితే పాడి గిట్టుబాటు కాక పశువులన్నీ పక్కనే ఉన్న నారాయణవలస సంత నుంచి కబేళాలకు తరలిపోయాయని ఆ ఊరి పెద్దలు చెప్పారు. ఇప్పుడు తమ ఊరికి పేరు మాత్రమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.  

దరివాడ గ్రామానికి చెందిన ఉప్పు వ్యాపారులు కలిశారు. ఆ ఊరుఊరంతా ఉప్పు అమ్ముకొని బతుకుతారట. వరుస తుపానులు, వర్షాలతో ఉప్పు పాడై ఉపాధి దెబ్బతింటోందని గోడు వెళ్లబోసుకున్నారు. లింగాలవలస ఎత్తిపోతల ద్వారా తమ ఊరికి సాగునీరు అందడం లేదని దరివాడ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిపోయిన కాస్త పైప్‌లైన్లు వేయకుండా అధికార నేతలు వివక్ష చూపుతున్నారని చెప్పారు. వెంకటాపురం ఎత్తిపోతల ద్వారా ఊడిగిలపాడుకు సాగునీరు అందకపోవడానికి ‘పచ్చ’ నాయకుల వివక్షే కారణమని రైతన్నలు వాపోయారు.  

ఈ ప్రాంతమంతా వరి ధాన్యం పండించే రైతన్నలే ఎక్కువ. కోత కోసిన వరి ధాన్యాన్ని రక్షించుకునేందుకు ఆ రైతన్నలు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూశాను. పూత దశలో ఒక తుపాను, కోత దశలో మరో తుపాను కొంప ముంచాయని రైతన్నలు వాపోయారు. వరి దిగుబడిపై తిత్లీ తీవ్ర ప్రభావం చూపిస్తే.. మిగిలిన కాస్త పంటను పెథాయ్‌ తుపాను లాగేసుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండిన కాస్త పంటను దాచుకోవడానికి గిడ్డంగులు లేక, అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల్లేక రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. గత నెలలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ‘ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదన్నా..’ అని రైతన్నలు వాపోయారు. పొలంలోని ఈ ధాన్యాన్ని ఏం చేసుకోవాలన్నా అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. ఏటా ఇన్ని ప్రకృతి విపత్తుల నడుమ ఎలా బతకాలన్నా అంటూ బావురుమన్నారు.  

ఆదుకోవాల్సిన ప్రభుత్వమేమో ధాన్యం కొనుగోలులోను, పరిహారం విషయంలోను మీనమీషాలు లెక్కిస్తోంది. ఏ మూలకు చాలని సాయం ప్రకటిస్తోంది. అరకొర సాయంలోనూ అవినీతి వెల్లువెత్తుతోంది. బాధితుల ఎంపిక మొదలుకొని నష్టాన్ని లెక్కగట్టడం, పరిహారం చెల్లించడం వరకు ప్రతి అడుగులోనూ వివక్ష కనిపిస్తోంది. జన్మభూమి కమిటీల మాఫియా రాజ్యమేలుతోంది. ఓవైపు ప్రకృతి, మరోవైపు ప్రభుత్వం రైతన్నల ఉసురు తీస్తున్నాయి.  

అన్నదాతల దయనీయ పరిస్థితికి అద్దం పట్టే ఓ హృదయ విదారక ఘటన నన్ను కలిచివేసింది. నీట మునిగిన తన పంటను చూసి తీవ్ర మానసిక క్షోభతో పంట పొలంలోనే ప్రాణాలొదిలేశాడు చిన్నయ్య అనే రైతన్న. పంట నష్టానికి భరోసా ఉంటే ఇలా జరిగేదా? శ్రీకాకుళం జిల్లాలోని కొసమాల గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన అయినా ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం కళ్లు తెరిపిస్తుందా? 

ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. ప్రపంచంలో ఎక్కడా లేని టెక్నాలజీని వాడి తుపాను నష్టాన్ని పూర్తిగా తగ్గించానని, తుపాను వల్ల ఒక్క మరణమూ లేదంటూ క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టాలనుకోవడం బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీకు భావ్యమేనా? కేవలం ఐఎండీ వారిచ్చిన నివేదికలపైనే ఆధారపడి, ఆ సమాచారాన్నే వాడుకుని అదంతా మీ గొప్పగా చెప్పుకోవడానికి నామోషీగా అనిపించడం లేదా? తుపాను గమనాన్ని గానీ, తీవ్రతను గానీ, కనుగొనడానికి మీరు వాడిన ప్రత్యేక పరిజ్ఞానం గానీ, పరికరాలు గానీ ఒక్కటంటే ఒక్కటైనా ఉన్నాయా?  
- వైఎస్‌ జగన్‌                   

 

తాజా వీడియోలు

Back to Top