నన్ను చూడగానే ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకోవడం మనసును కదిలించింది..

 

12–11–2018, సోమవారం 
కొయ్యానపేట, విజయనగరం జిల్లా

పదిహేడు రోజుల విరామం తర్వాత ప్రజాక్షేత్రంలోకి మళ్లీ అడుగులేశాను. ఈ విరామానికి కారణమేమన్నది ప్రజలందరికీ తెలిసిందే. గత నెల 25న విశాఖ ఎయిర్‌పోర్టులో నాపై జరిగిన హత్యాయత్నం నుంచి దేవుని దయ, ప్రజల ఆశీస్సులే నన్ను రక్షించాయి. ఆ ఘటన వెనకున్న కుట్ర, ఘటనానంతర పరిణామాలు, వాస్తవాలను సమాధి చేయాలన్న సర్కారు కుయత్నాలు, పాలకనేతల వ్యవహార శైలి.. దిగజారిపోయిన, విలువల్లేని రాజకీయాలకు నిదర్శనంగా నిలిచాయి.  

వైద్యుల సూచనల మేరకు గాయం కాస్త నయం అయ్యేదాకా విశ్రాంతినిచ్చి.. నేడు తిరిగి పాదయాత్రను ప్రారంభించాను. ఈ రోజంతా చాలా ఉద్విగ్నభరితంగా సాగింది. ఏడాదిగా సాగుతున్న పాదయాత్రలో ప్రజల యోగక్షేమాల గురించి నేను అడిగేవాడిని.. వారి కష్టాలు వినేవాడిని.. భరోసాగా ఉంటానంటూ ధైర్యాన్నిచ్చేవాడిని. అలాంటిది.. ఈ రోజు నన్ను కలిసిన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, ఆత్మబంధువులంతా ‘అన్నా.. ఎలా ఉన్నావ్‌? బాబూ.. దెబ్బ మానిందా? ఆరోగ్యం బాగుందా? మేమున్నాం నీకు’ అంటూ నన్ను పరామర్శించడం కొత్తగా అనిపించింది. నన్ను చూడగానే ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకోవడం మనసును కదిలించింది.   

ఈ రోజు క్రైస్తవ సోదరులు, ముస్లిం పెద్దలు నా కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతేకాకుండా నేడు కార్తీక సోమవారం సందర్భంగా ములక్కాయవలసలోని పురాతన కాశీవిశ్వేశ్వరాలయంలో ఎంతోమంది అక్కచెల్లెమ్మలు నా కోసం శివార్చనలు చేసి.. ప్రసాదాలు తీసుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజలు నాపట్ల చూపుతున్న తపన, తాపత్రయం కదిలించి వేసింది. మరికొంతమంది నా చేతికి రక్షలు కట్టారు. ఈ ప్రజల ప్రేమ, ఆప్యాయతలు చూస్తుంటే.. ప్రతిక్షణం ప్రజల కోసమే జీవించాలన్న నా సంకల్పం మరింత బలపడింది. ఈ ప్రపంచంలో ఏ శక్తీ నన్ను ప్రజల నుంచి విడదీయలేదన్న నమ్మకం మరింత దృఢపడింది. మధ్యాహ్న శిబిరం వద్ద రాజమండ్రికి చెందిన బలహీనవర్గాల నేతలు, తంబళ్లపల్లికి చెందిన కాపు నాయకులు పార్టీలో చేరారు.  

సాయంత్రం పాపయ్యవలస వద్ద చిట్టెమ్మ అనే మహిళా రైతు కలిసింది. రెండెకరాల పత్తి వేస్తే.. వర్షాల్లేక పంట దిగుబడి తగ్గిపోయిందని.. పండిన ఆ కాస్త దానికీ గిట్టుబాటు ధరలేక నష్టాలపాలయ్యామని వాపోయింది. అదే గ్రామంలో మరికొందరు రైతన్నలు కలిశారు. వెంగళరాయసాగర్‌ నుంచి వచ్చే కాల్వలకు పూడికలు తీయక, మరమ్మతులు చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రకృతి.. మరోవైపు పాలకుల నిర్లక్ష్యం.. అన్నదాతల పాలిట శాపంగా మారడం బాధనిపించింది.  

మడవలసకు చెందిన రుష్మి, రత్నాలు, దీప్తి తదితర గిరిజన బాలికలు కలిశారు. చదువుకోవాల్సిన వయసులో వంద రూపాయల కూలి పనులకు వెళుతున్నామని చెబుతుంటే.. బాధనిపించింది. మరోవైపు.. స్థోమతలేక ఆ బిడ్డల్ని చదివించడం లేదని వారి పెద్దలు వాపోయారు. కేవలం ఎన్నికలప్పుడే గిరిజన సంక్షేమం గుర్తుకొచ్చే పాలకులకు ఈ కష్టాలెలా కనిపిస్తాయి?! 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. కేవలం ఎన్నికలకు మూడు నెలల ముందు.. మూణ్ణాళ్ల ముచ్చటగా గిరిజనులకు, మైనార్టీలకు మంత్రి పదవులివ్వడం.. ఆ వర్గాలను మరోమారు మోసపుచ్చడానికే కాదా? 


Back to Top