02–10–2018, మంగళవారం కొండవెలగాడ, విజయనగరం జిల్లా ఇవాళ ఇద్దరు మహనీయులు.. మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించాను. వారి స్ఫూర్తి తరతరాలకు వెలుగుబాటే. విజయనగరం మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కలిశారు. తమ బతుకుల్ని రోడ్డున పడేసే కుయుక్తులు పన్నుతోందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది కుటుంబాలు ఆధారపడ్డ పారిశుద్ధ్య సేవలను ప్రైవేటుపరం చేసి, బినామీ కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ లంచాల కోసం తమ కడుపు కొడుతున్నారని కంటతడిపెట్టారు. ఆ వృత్తిలో అత్యధికులు దళితులే. ‘ఓ వైపు మా జీవితాలను చీకటిమయం చేస్తూ, మరోవైపు దళిత తేజం అనడం వంచన కాదా’అని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి పిల్లలకు మధ్యాహ్న భోజనం వండిపెడుతున్న అక్కచెల్లెమ్మలది అదే గడ్డు పరిస్థితి. వారికిస్తుందే నెలకు రూ.1,000. నాలుగు నెలలుగా వేతనాలు లేవు.. బిల్లులూ రావు. అప్పులు చేసి సరుకులు తెచ్చుకుంటున్న దుస్థితి. ఓ వైపు ప్రభుత్వమే తక్కువ మొత్తాలు కేటాయిస్తూ.. నాసిరకం బియ్యాన్ని, కుళ్లిపోయి పురుగులు పట్టిన గుడ్లను సరఫరా చేస్తోంది. మరోవైపు నాణ్యత లేని భోజనం అనే నెపాన్ని వేసి కమీషన్ల కోసం ప్రైవేటువారికి ఈ పథకాన్ని కట్టబెడుతోంది. మరి ఏళ్ల తరబడి దీన్నే నమ్ముకున్న వేలాది కుటుంబాలు ఏమైపోవాలి? జేఎన్‌టీయూలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఆచార్యులు కలిశారు. అందరూ బీటెక్, ఎంటెక్ ఐఐటీల్లో చదివినవారే. పదేళ్లుగా పనిచేస్తున్నా జీతం రూ.17 వేలే. తాము చదువుకున్న చదువుకు, తమ అనుభవానికి ఈ సర్కారు కట్టే విలువ ఇదేనా అని నిస్పృహ వెలిబుచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఆపద్బంధువులా ఆదుకునే 108 వ్యవస్థకు జబ్బు చేసింది. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ‘చాలీచాలని, నెలల తరబడి రాని వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా, వేధింపులు ఎదుర్కొంటూ.. ఎన్నాళ్లిలా’అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.. 108 సిబ్బంది. ‘వేతనాలు ఇవ్వరు.. వెట్టి చాకిరీ చేయించుకుంటారు.. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఎదుగూబొదుగూ లేని జీవితాలు’అంటూ వాపోయారు.. సెకండ్ ఏఎన్‌ఎంల రాష్ట్ర సంఘం ప్రతినిధులు. ఉపాధి పోతోందని, ఉద్యోగ భద్రత లేదని, వేతనాలు ఇవ్వడం లేదని, చాలీచాలని జీతాలని, వేధింపులు ఎక్కువయ్యాయని, వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని.. ఇలా నన్ను కలిసిన ఒక్కో ఉద్యోగిది ఒక్కో ఆవేదన. ఆసక్తికర విషయమేమిటంటే.. బాబుగారి ఏదో ఒక బూటకపు హామీకి బలికాని ఉద్యోగి ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం. రాజకీయ వివక్ష లేని ప్రాంతమంటూ లేదు. వైఎస్సార్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. ఆ కాలనీకి వైఎస్సార్ అని పేరుపెట్టుకున్నందుకు అంటరానివారిగా చూస్తున్నారు. నీళ్లు ట్యాంకర్లతో కొనాల్సిన పరిస్థితి. రోడ్లు, లైట్లు లేనే లేవు. డ్రైనేజీ మరీ దారుణం. చినుకు పడితే చెరువును తలపిస్తోంది. 25వ వార్డుది ఇలాంటి పరిస్థితే. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ గెలిచారని కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. అసలే అభివృద్ధి పనులు ఎక్కడా జరగడం లేదు. ఆపై ఇస్తున్న అరకొరా సంక్షేమ పథకాల నిధులకు కోతపెడితే పేదలెలా బతకాలి? స్థానిక సంస్థల దుస్థితిని కళ్లకు కట్టారు నన్ను కలిసిన సర్పంచ్‌ల సంఘం ప్రతినిధులు.. మామిడి అప్పలనాయుడు, రంగారావు, రోషిరెడ్డి. జన్మభూమి కమిటీలతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారన్నారు. ‘ఇదేనా మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు బస చేసిన కొండవెలగాడ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ సదుపాయాలు లేకున్నా ఎందరో అంతర్జాతీయ స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులను అందించిన ఘనత ఈ గ్రామానిది. ఇక్కడ వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీని ఏరా>్పటు చేస్తానని బాబుగారు హామీఇచ్చి మూడేళ్లయింది. ఆయనగారి అన్ని హామీలలానే ఇదీ అటకెక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఇంటికో ఉద్యోగం, ఉపాధి లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా కేవలం మీ కమీషన్ల కక్కుర్తి వల్లే మధ్యాహ్న భోజనం, పారిశుద్ధ్య విభాగం.. ఇలా అనేక రంగాలకు చెందిన వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోతుండటం వాస్తవం కాదా?