ఏపీ అంటే ఎందుకంత లెక్కలేనితనం

 – ప్రత్యేక హోదా మన ఊపిరి
– వైయస్‌ జగన్‌ నాయకత్వంలో హోదాను సాధించుకుందాం
– టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి పోరాటం చేయాలి



ఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌  అంటే కేంద్రానికి లెక్కలేనితనంగా మారిందని, ఎందుకు అన్యాయం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు వయస్సును లెక్క చేయకుండా దీక్ష చేయడం గొప్ప విషయమన్నారు. నాలుగో రోజు ఎంపీల ఆమరణ దీక్షలో విజయమ్మ పాల్గొని ప్రసంగించారు. నాడు పార్లమెంట్‌ సాక్షిగా చెప్పిన మాటలకు విలువ లేదా? ప్రధాని చెప్పిన హామీకి విలువ లేదా అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంట్‌లో చెప్పిన అంశాలనే అడుగుతున్నామన్నారు.  టీడీపీ నేతల వ్యాఖ్యలు బాధాకరమని వైయస్‌ విజయమ్మ అన్నారు. ఇప్పటికీ మూడు వికెట్లు పడ్డాయని, మిగిలిన రెండు వికెట్లు పడిపోతే బీజేపీతో కలిసిపోతారని టీడీపీ నేతలు పేర్కొనడం దుర్మార్గమన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్న చంద్రబాబు, ఆయన అనుచరులు మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. కేంద్రానికి ఏపీ అంటే లెక్కలేని తనంగా మారిందన్నారు. ఇందుకు చంద్రబాబు చేసిన అవినీతే కారణమన్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇన్నాళ్లు అడగకపోవడం వల్లే బీజేపీకి ఏపీ అంటే చులకనాభావం కలిగిందన్నారు. ఈ రోజుకైనా కేంద్రం కళ్లు తెరవాలని బతిమిలాడుతున్నామన్నారు. గత తొమ్మిదేళ్లలో చంద్రబాబు చేసింది ఏమీ లేదని, ఇప్పుడు నాలుగేళ్లు కూడా ఏమీ చేయలేకపోయారన్నారు. మీడియా కూడా నిజాలు బయటకు తీయాలని, ఎవరు పోరాడుతున్నారో సమాజానికి చూపాలన్నారు. బేషజాలకు పోకుండా ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు కూడా తమ పదవులకు రాజీనామాలు చేసి ప్రత్యేకహోదాను సాధించుకుందామన్నారు. ప్రజలు కూడా భయపడాల్సిన అవసరం లేదని, అందరం ఒక్కటై వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పోరాడి సాధించుకుందామని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలందరూ కూడా నిజాలు గ్రహించాలని కోరారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలని, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలను ఆశీర్వదించాలని ఆమె కోరారు.
Back to Top