మచిలీపట్నంః టీడీపీ పాలనలో అన్ని రకాలుగా మోసపోయిన ప్రజలు చైతన్యవంతులయ్యారు. సంక్షేమ పథకాల ప్రచారం పేరుతో చేయని పనులను చేసినట్టు చెప్పుకుంటూ .... మరోసారి మభ్యపెట్టేందుకు జనాల్లోకి వెళ్లిన టీడీపీ ప్రజాప్రతినిధులు, మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా జనచైతన్యయాత్రల పేరుతో ఊళ్లు తిరిగుతున్న పచ్చనేతలపై ప్రజలు ఎక్కడిక్కడ తిరగబడ్డారు. <br/>కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భూసేకరణ నోటిఫికేషన్‌పై గుర్రుమీదున్న పలు గ్రామాల రైతులు యాత్రలకు బ్రేకులు వేశారు. ఇంటింటికీ నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జనచైతన్యయాత్రలను బహిరష్కరించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కాన్వాయ్ మార్గంలో చెట్లకు ఫ్లెక్సీలను వేలాడదీసి గ్రామస్తులు నిరసనలు తెలిపారు. మచిలీపట్నం మండలంలోని పొట్లపాలెం గ్రామస్తులు భూసేకరణ నోటిఫికేషన్ నిర్ణయంపై తిరగబడి, ప్రభుత్వంపై పలుమార్లు పోరాటాలు చేసి కేసుల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే విసుగుపుట్టి పచ్చచొక్కాల యాత్రలకు చెక్ పెట్టారు.