హైదరాబాద్, సెప్టెంబర్ 2012 : పాపులారిటీ కోసమే వైయస్ విజయమ్మ ఫీజు దీక్ష చేస్తున్నారంటూ కాంగ్రెస్ వ్యాఖ్యలపై వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఈ పథకానికి రూపశిల్పి అయిన దివంగత మహానేత సతీమణిగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఆమె దీక్షను తప్పుపట్టడాన్ని పార్టీ నేత జూపూడి ప్రభాకర్ నిరసించారు. ప్రభుత్వం అనాలోచిత చర్యల కారణంగా వేలాది మంది పేద విద్యార్థుల జీవితాలు అన్యాయం కాకూడదన్న సదాశయంతో విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షపై వక్రభాష్యాలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.వైయస్ హయాంలో సంతృప్త స్థాయిలో విద్యార్థులకు అభయం ఇస్తే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిబంధనల పేరుతో భయపెడుతున్నదని జూపూడితో పాటు సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు అన్నారు. ఇంజనీరింగ్‌లో చేరుతున్నవారిలో చాలామంది గ్రామీణ విద్యార్థులే అయినందున చాలామంది మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారన్నారు. ఉత్తీర్ణతకు ఫీజు చెల్లింపునకు లింక్ పెట్టడం పథకం ఎత్తివేయాలనే దుర్బుద్ధి కాకపోతే మరేమిటని విద్యావేత్త మదన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.