'విద్యుత్‌ వాత పెడితే.. ప్రజాగ్రహం శిక్ష తథ్యం'

కల్వకుర్తి (మహబూబ్‌నగర్‌ జిల్లా) : విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను‌ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని వైయస్ కాంగ్రెస్ ‌పార్టీ‌ పాలమూరు జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి డిమాం‌డ్ చేశారు.‌ ప్రజలపై విద్యు‌త్ చార్జీ భారం మోపితే ప్ర‌జాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కల్వకుర్తిలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ చార్జీల పెంపు వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడుతుందన్నారు. కిరణ్ కుమార్ ‌రెడ్డి ప్రభుత్వం ఇటీవల పెంచిన చార్జీల నుంచి ప్రజలు తేరుకోక‌ ముందే మళ్లీ విద్యుత్ చార్జీలు పెంచడం దారుణమన్నారు.‌‌ ప్రజాగ్రహానికి గురై కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు.

ఒక వైపు తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు లేక, పశుగ్రాసం లేక, పండిన పత్తి, ఇతర కొద్దిపాటి పంటలకు కూడా గిట్టుబాటు ధర లభించక అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఎడ్మ ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే జీ ఓ 420ను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి అమల్లోకి తెచ్చినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఆర్థికసాయం అందించే స్థితిలో లేదన్నారు.  రైతులకు ఉచిత విద్యుత్ ‌సరఫరాలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. విద్యుత్ ఎప్పు‌డు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేన్నారు.
Back to Top