వైద్య చికిత్సకు నిరాకరిస్తున్న ఎమ్మెల్యేలు

హైదరాబాద్, 4 ఏప్రిల్‌ 2013: పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలనే డిమాండ్‌తో మూడు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఆరోగ్యం క్షీణిస్తున్నది‌. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మద్దతుగా ఉన్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సు ఆవరణలో 'కరెంట్‌ సత్యాగ్రహం' చేస్తున్నారు.

ఆరోగ్యం క్షీణించిన ఎమ్మెల్యేలు ఆస్పత్రికి తరలించేందుకు సహకరించాలని హైదరాబాద్ సెంట్రల్ జో‌న్ ఏసీపీ‌ రాం నర్శింహారెడ్డి కోరారు.‌ అయితే, పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించే వరకు తాము దీక్ష విరమించేది లేదని ఎమ్మెల్యేలు నిరాకరించారు. తమ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎమ్మెల్యేలు సహకరించేలా చూడాలని అనంతరం శ్రీమతి విజయమ్మకు ఆయన విజ్ఞప్తి చేశారు.‌ పెంచిన విద్యుత్ ఛార్జీల భారం తగ్గించే వరకూ దీక్ష వదిలిపెట్టబోమని ఆమె కూడా స్పష్టంచేశారు.

కాగా, 'కరెంట్‌ సత్యాగ్రహం' దీక్ష చేస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి గురువారం అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరికీ చక్కెర స్థాయిలు బాగా తగ్గిపోయాయని, తక్షణమే వైద్యం అందించాలని వైద్య పరీక్షలు నిర్వహించిన ఉస్మానియా వైద్యులు సూచించారు.
Back to Top