త్వరలో ప్రజల మధ్యకు జగన్మోహన్‌రెడ్డి

రాజంపేట, 15 డిసెంబర్ 2012: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వస్తారని పార్టీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంకిత భావంతో ఆందోళనలు చేసిన శ్రీ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారన్నారు. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య తిరుమలకు నడిచిన అటవీ మార్గాన్ని అభివృద్ధి చేయాలంటూ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మహా పాదయాత్ర చేపట్టారు.

     ఆకేపాడు ఆలయాల క్రాస్ నుంచి వేలాది మంది భక్తులు, కార్యకర్తలతో శనివారం తెల్లవారు జామున 4 గంటలకు అమర్నాథ్ రెడ్డి తిరుమలకు బయలుదేరారు. మామండూరు నుంచి శేషాచలం అటవీ ప్రాంతంలో అన్నమయ్య కాలిబాటన వచ్చే సోమవారం శ్రీవారి సన్నిధికి చేరుకోనున్నారు. రాజంపేట నుంచి తిరుమల కొండకు ఆకేపాటి పాదయాత్ర చేయడం ఇది 10వ సారి.

     ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ మార్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు,  ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ మార్గం ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు.

Back to Top