- రాష్ట్రాన్ని అడ్డగొలుగా విభజించి ఏపీకి అన్యాయం చేశారు
- ప్రత్యేక హోదా కుదరదు... ప్యాకేజీ ఇస్తామనడం సిగ్గుచేటు
- ఇప్పటికే రెండేళ్లయి పోయింది... ఇక ఊరుకునేదీ లేదు
- వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ సభ్యులు
న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 5 కోట్ల ప్రజలను మోసం చేశాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారు. ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ చర్చలు అంటున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని హామీలను అమలుచేయాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. రెండవ రోజు హోదా కోసం లోక్ సభలో స్పీకర్ పోడియం వద్ద వైయస్సార్సీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.
ప్రత్యేక హోదా తప్పనిసరి
డిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో ఎటువంటి మార్పు రాలేదని వైయస్సార్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం కానీ ప్రత్యేక హోదా మాత్రం కుదరదని కేంద్రం చెప్పడం సిగ్గు చేటన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదా కావాలని వైయస్సార్‌సీపీ ఎంపీలందరం డిమాండ్ చేశామన్నారు. కచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అని కుండబద్దలు కొట్టారు.
ఇప్పటికే రెండేళ్లు అవకాశం ఇచ్చాం
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఇప్పుడు మాట మార్చిందని వైయస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. విభజన చట్టంలో ఉన్న విధంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఇప్పటికే రెండేళ్లు ఎదురుచూశామని... ఇక ఎదురు చూసే ప్రసక్తే లేదన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు వైయస్సార్‌సీపీ పోరాటాలు కొనసాగిస్తుందన్నారు.