ప్రజల ముంగిటికే ప్రభుత్వం తెస్తా

ముమ్మిడివరం (తూ.గో.జిల్లా) :

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను చేసే నాలుగు సంతకాలతో పాటు ఐదో సంతకం కూడా చేస్తానని, అది 'ప్రజల ముంగిటికే ప్రభుత్వం' అనే దానిపై అని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇవాళ్టికీ తమకు పింఛన్‌ రాలేదని, ఇల్లు లేదని ప్రజలు నాకు చెబుతున్నారు. రేషన్‌కార్డు లేదంటున్నారు. తమకింకా ఆరోగ్యశ్రీ కార్డు లేదంటున్నారు. ఈ పరిస్థితి లేకుండా చేస్తానని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇవన్నీ తీసుకోవడం ప్రజల హక్కుగా మారుస్తానని భరోసా ఇచ్చారు. ఇందు కోసం ప్రతీ గ్రామంలో ఒక ఆఫీసు తెరుస్తానని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో వైయస్ఆర్‌ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారంనాడు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, ముమ్మిడివరంలలో రోడ్‌షోలు నిర్వహించారు. ముమ్మిడివరంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.

'ప్రతి గ్రామంలో ఒక కంప్యూటర్ పెట్టి రెటీనా మిషన్, లామినేషన్, స్కాన‌ర్ పెట్టి ఏ కార్డు కావాలన్నా క్షణాల్లో ఇచ్చేలా చేస్తాను. అదే ఆఫీస్ నుంచి పింఛను కూడా ఇస్తాను’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. దివంగత రాజశేఖరరెడ్డి ఐదేళ్లలో 47 లక్షల ఇళ్లు కట్టిస్తే తాను అంత కంటే ప్రతి ఏటా మరొక లక్ష అదనంగా ఇళ్లు నిర్మిస్తానని భరోసా ఇచ్చారు. అమలాపురం పార్లమెంటుకు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ను, ముమ్మిడివరం అసెంబ్లీకి గుత్తుల సాయిని పార్టీ అభ్యర్థులుగా శ్రీ జగన్ ప్రకటించారు.

‌మన మనసెరిగిన వారికే ఓటేయండి :
'మరో 45 రోజుల్లో వరుసగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాత మన భవిష్యత్‌ను నిర్ణయించే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు మన తలరాతలను మార్చేదిగా ఉండాలి. ఓటు వేసే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఆ దేవుడు 8.50 కోట్ల ప్రజానీకంలో ఒక్కరికే ముఖ్యమంత్రి అవకాశం ఇస్తాడు. ఏ వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నప్పుడు ప్రజల మనసు తెలుసుకుంటాడో, ప్రజల గుండెచప్పుడు వింటాడో, చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో బతికే ఉండగలడో అలాంటి నాయకుడినే ఎన్నుకోండి' అని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత పైనున్న రాజశేఖరరెడ్డి గర్వపడే విధంగా నాలుగు సంతకాలు చేస్తాను. అవి రాష్ట్రం దశ, దిశను మార్చేవిగా ఉంటాయి. మొట్టమొదటి సంతకం అక్కచెల్లెళ్ల కోసం పెడతా. బడికి పంపించే పిల్లలకు ఒకరికైతే రూ.500, ఇద్దరికైతే రూ.1,000 చొప్పున వారి తల్లుల బ్యాంక్ అకౌంట్‌లో జమచేస్తాను. అవ్వా తాతలకు ‌పింఛన్ రూ.200 ‌నుంచి రూ.700 పెంచుతూ రెండో సంతకం చేస్తాను. రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తూ మూడో సంతకం చేస్తాను. డ్వాక్రా అక్కా చెల్లెళ్లకు కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తూ నాల్గో సంతకం చేస్తాను.

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు :
'చంద్రబాబుకు ఇవే చివ రి ఎన్నికలు. ఆ తర్వాత ఆయన పార్టీ ఉంటుందో లేదో చెప్పలేం. అందుకే ఇప్పుడు ఏదో విధంగా అధికారంలోకి రావాలని ఆయన నోటికొచ్చినట్టు హామీలిస్తున్నారు. ప్రజలను మోసం చేసేందుకు కూడా ఆయన వెనుకాడడం లేదు. ఆయనలా నాకు అబద్ధాలాడడం చేతకాదు. ఎందుకంటే బాబు కంటే నేను పాతికేళ్లు చిన్నవాణ్ణి, నేను ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిని. రైతులు, డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు హామీలు ఇచ్చేశారు. రాష్ర్టంలో రైతు రుణాలు రూ. లక్షా 25 వేల కోట్లున్నాయి. డ్వాక్రా సంఘాలకు రూ.20వేల కోట్ల రుణాలున్నాయి. వీటికి తోడు ఉచితమంటూ చాలా హామీలిస్తున్నారు. మన రాష్ర్ట బడ్జెట్ రూ. లక్షా 25 వేల కోట్లయితే చంద్రబాబు మాఫీ కార్యక్రమాల లెక్క ఏకంగా రూ.లక్షా 65 వేల కోట్ల‌ వరకూ ఉంది. 2008లో కేంద్రం 28 రాష్ట్రాలకు రూ.65వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తే మన రాష్ట్రానికి రూ.12వేల కోట్లు మాత్రమే వచ్చింది. అలాంటిది చంద్రబాబుకు ఏకంగా లక్షా 25వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి' అన్నారు.

'ఈ రాష్ర్టంలో మూడున్నర కోట్ల ఇళ్లు ఉంటే ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు. రాష్ర్టం మొత్తమ్మీద ఉద్యోగస్తులు 20 లక్షల మంది ఉంటే.. చంద్రబాబు ఏకంగా మూడున్నర కోట్ల ఉద్యోగాలిస్తానని చెబుతున్నారంటే ఆయన్ను ఏమనుకోవాలి. 30 ఎంపీ స్థానాలు మనమే గెల్చుకోవాలి. మన రాష్ట్రానికి డబ్బులిచ్చే వారినే ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టుకోవాలి. మన రాష్ర్ట రాజధానిని మనమే నిర్మించుకుందాం. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేసి చూపిస్తాను. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు 3, 4 పెద్ద పోర్టులు తీసుకొస్తా.. కోస్తా తీరంలో భారీ పరిశ్రమలు తీసుకొస్తా. మన రాష్ర్టం గుజరాత్‌తో పోటీపడేలా ఐదేళ్లలో అభివృద్ధి చేస్తా. చంద్రబాబు ఏనాడూ ఆలోచించని విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను’ అన్నారు.

Back to Top