రాష్ట్రంలో ఎన్ని ఇళ్లున్నాయో తెలుసా?

నర్సాపురం (ప.గో.జిల్లా) :

'ఇంటికో ఉద్యోగం ఇస్తానని పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబూ!... అసలు రాష్ట్రంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో మీకు తెలుసా?' అని వైయస్ఆర్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అక్షరాలా మూడున్నర కోట్లు ఇళ్ళున్నాయన్నాని శ్రీ జగన్‌ తెలిపారు. అంటే మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడంలోని ఆయన నిజాయితీ ఏమిటో ఇట్టే తెలిసిపోతోందని విమర్శించారు. ‘అధికారం పోయిన చంద్రబాబులో ఏదైనా మార్పు వస్తుందనుకుంటే ఇవాళ్టికీ అలాంటిదేమీ లేకుండా పోయింది. ప్రజలను ఎలా మోసం చేయాలి అనే ఆయన పన్నాగాలు పన్నుతున్నారు' అని చంద్రబాబుపై శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు.‌ ‌పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని స్టీమర్‌రోడ్డులో నిర్వహించిన ‘వైయస్ఆర్ జనభేరి’ బహిరంగ సభలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు.

‘చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారు. 23,500 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించారు. అంగన్‌వాడీ టీచర్లు జీతాలు పెంచాలని అడిగితే గుర్రాలతో తొక్కించారు. ఇలాంటి చంద్రబాబు ఇప్పుడు ప్రజలను మోసం చేయడానికి సాధ్యం కాని హామీలిస్తున్నారు. ఆ మనిషిని ఏమనుకోవాలి? ఇప్పటికీ అన్నీ ఫ్రీగా ఇస్తానంటూ ఆల్‌ ఫ్రీ హామీలిస్తున్నారు. కళ్లార్పకుండా ఒకే అబద్ధాన్ని వందసార్లైనా చెప్పగల సమర్థుడు చంద్రబాబు. ఆయన వయసు 60 ఏళ్ళు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. అందుకే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, చివరకు ప్రజలకు వెన్నుపోటు పొడవడానికి కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు’ అని శ్రీ జగన్ ధ్వజమెత్తారు.

ఒకరు చనిపోతేనే మరొకరికి పింఛన్‌ :
'మహానేత డాక్టర్‌ వైయస్ఆర్ సువర్ణయుగానికి ముందు చంద్రబాబు నాయుడు ‌సీఎం స్థానంలో ఉండేవారు. అవ్వా తాతలకు ముష్టి వేసినట్లు రూ.75 పింఛన్ ఇచ్చేవారు. ఒక ఊళ్లో పెన్ష‌న్ తీసుకుంటున్న ఎవరో ఒకరు చనిపోతే కానీ కొత్తవారికి పెన్ష‌న్ ఇవ్వలేమని అధికారులు చెప్పేవారు. ఆ రోజుల్లో పిల్లల ఇంజనీరింగ్‌ ఫీజులు కట్టాలంటే తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేది. గ్రామాల్లో ఎవరికన్నా గుండెనొప్పి వచ్చి ఆపరేషన్‌కు అయ్యే  రెండు లక్షల కోసం కుటుంబ సభ్యులు ఐదు రూపాయల వడ్డీకైనా అప్పు తెచ్చి కట్టేవారు. అప్పు తీర్చడానికి కుటుంబ సభ్యులు జీవితాంతం ఊడిగం చేసిన రోజులున్నాయి. డ్వాక్రా మహిళలను ఎన్నికల సమయంలో చంద్రబాబు ఓట్ల కోసం వినియోగించుకునేవారు. విశ్వసనీయత అనే పదానికి అర్థం చంద్రబాబుకు తెలియదు' అని శ్రీ జగన్‌ విమర్శించారు.

మళ్లీ అబద్ధాలు వల్లిస్తున్న చంద్రబాబు :
'చంద్రబాబు అబద్ధాలు ఏ స్థాయికి చేరాయో రైతన్నలు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానంటున్న ఆయన మాటలే చెబుతున్నాయి. రైతు రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు కదా మీరూ అలా చెప్పండి అని చాలా మంది నన్ను అడిగారు. రాష్ట్రంలో రైతన్నల రుణాలు లక్షా 27 వేల కోట్లున్నాయి. డ్వాక్రా రుణాలు రూ.20 వేల కోట్లున్నాయి. చంద్రబాబు ఉచిత హామీలు చాలా ఇస్తున్నారు. 2008లో దేశం మొత్తం మీద 28 రాష్ట్రాల్లో రూ.65 వేల కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేసింది. అందులో మన రాష్ట్రంలో అప్పులు కట్టలేక దివాలా తీసిన రైతులకు సంబంధించి రూ.12 వేల కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేశారు. కేంద్ర ప్రభుత్వమే రూ.65 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తే.. చంద్రబాబు రూ. లక్షా 27 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్ర బడ్జెట్ లక్షా 25 వేల కోట్లు. చంద్రబాబు మాఫీ కార్యక్రమాలు అమలు చేయాలంటే రూ.లక్షా 60 వేల కోట్ల దాకా కావాలి. పదవి కోసం ఏ గడ్డయినా తినేవాడెవరైనా ఉన్నారంటే అది బాబే‌' అని శ్రీ జగన్ నిప్పులు చెరిగారు.

బాబులా దొంగ హామీలివ్వలేను :
'చంద్రబాబులా నేను దొంగ హామీలివ్వలేను. నేనిచ్చే ప్రతి హామీని అమలు చేసి చూపిస్తా. దివంగత మహానేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి నుంచి నాకు వారసత్వంగా వచ్చింది విశ్వసనీయత. సీఎం అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నాలుగు సంతకాలు పెడతా. ఆ నాలుగు సంతకాలు రాష్ట్ర చరిత్రను మార్చేస్తాయి. మొదటి సంతకం అక్కచెల్లెమ్మల కోసం పెడతా. మీ పిల్లల్ని బడికి పంపించండి. ప్రతి చిన్నారికి రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరు పిల్లలకు రూ.వెయ్యి  మీ బ్యాంక్ ‌ఖాతాలో వేసే పథకం తెస్తా. అక్కచెల్లెళ్ల పిల్లల కోసం ప్రతి స్కూల్‌లోనూ ఇంగ్లిష్ మీడియం పెడతా. రెండో‌ సంతకం అవ్వా తాతల కోసం చేస్తా. వారి పెన్షన్‌ను రూ.200 నుంచి రూ.700 పెంచేందుకు చేస్తా. మూడో సంతకం రైతన్నల కోసం పెడతా. ధాన్యానికి గిట్టుబాటు ధర, మద్దతు ధర కల్పించేందుకు మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం సంతకం పెడతా. నాలుగో సంతకం డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం వారి రుణాలను మాఫీ చేసేందుకు పెడతా’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌ను, రాష్ట్ర ప్రజలను చంద్రబాబు అమ్మేయడంతో మనకు ప్రస్తుత దుస్థితి ఏర్పడిందని శ్రీ వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. చదువుకున్న ప్రతి పిల్లాడికీ నేను తోడుంటానన్నారు. వారి కోసం ఐదో పని చేయాల్సి ఉందన్నారు. కలసికట్టుగా ఉందాం. 25, 30 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. మన రాష్ట్ర అభివృద్ధికి డబ్బులిచ్చే వ్యక్తిని ప్రధాని కుర్చీలో కూర్చోబెడదాం‌ అన్నారు.

పార్టీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు :
నరసాపురం వైయస్ఆర్ జనభేరి సభలో నరసాపురం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ‌శ్రీ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. శ్రీ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతించారు. శ్రీ జగన్‌ను ఆపే శక్తి ఎవరికీ లేదని, ఆయనకు ఎదురెళ్లటం సునామీకి ఎదురు వెళ్లినట్టేనని కొత్తపల్లి అభివర్ణించారు. బడుగు, బలహీన వర్గాల పెన్నిధిగా శ్రీ జగన్‌ను జనం చూస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని ధైర్యంగా చెప్పిన ఏకైక పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డే అన్నారు. పేదవాడికి పది రూపాయలు పెట్టాలంటే మనసు ఉండాలని, గుండె ఉండాలని, అటువంటి వ్యక్తి శ్రీ జగన్ అని సుబ్బారాయుడు చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top