హైదరాబాద్, 31 ఆగస్టు 2013:
ఆరోగ్యం ప్రమాదకర స్థాయికి చేరినా దీక్ష విరమించమన్న తమ విజ్ఞప్తిని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి వినడం లేదని ఆయన సతీమణి శ్రీమతి వైయస్ భారతి ఆవేదన వ్యక్తంచేశారు. దీక్ష విరమించమని శ్రీమతి వైయస్ విజయమ్మ మొన్న ఎంతగా నచ్చ చెప్పినా శ్రీ జగన్ వినలేదన్నారు. ఆయన ఎవరి మాటా వినరన్నారు. తాను అనుకున్నదే చేస్తారని చెప్పారు. నాంపల్లి సిబిఐ కోర్టు అనుమతితో శ్రీ జగన్మోహన్‌రెడ్డికి సాయంగా ఉండేందుకు శ్రీమతి భారతి శనివారం నిమ్సుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలంతా క్షేమంగా ఉండాలని శ్రీ జగన్ కోరుకుంటున్నారని తెలిపారు. శుక్రవారం సాయంత్రం నుంచి శ్రీ జగన్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని డాక్టర్లు తమకు చెప్పారని శ్రీమతి భారతి తెలిపారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
సమన్యాయం చేయలేకపోతే.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ.. ఏడు రోజులుగా కొనసాగిస్తున్న దీక్షతో ప్రమాదకరంగా తయారైన శ్రీ జగన్ ఆరోగ్యం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా దీక్ష విరమించాలని పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు కోరుతున్నారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుతూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు విశాఖలోని సింహాచలం కొండపైకి మోకాళ్లపై నడుస్తూ వెళ్లారు. అలాగే శ్రీ జగన్ ఆరోగ్యంపై విజయవాడలోనూ అభిమానులు ఆలయాల్లో పూజలు నిర్వహించారు.