ఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా),
10 జూలై 2013: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై యెల్లో కూటమి చేస్తున్న ఆరోపణలను పార్టీ ఎమ్మెల్యే, శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆ కూటమికి ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మారటం లేదని అన్నారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తి చేసిన పనిని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా అంటగడతారని ఆమె సూటిగా ప్రశ్నించారు. శోభా నాగిరెడ్డి బుధవారం ఆళ్లగడ్డలో మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడో జరిగిన సంఘటనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి సంబంధం ఏమిటని నిలదీశారు. టిడిపి దాని మిత్ర పక్షం కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగానే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నాయని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్రీ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె నిప్పులు చెరిగారు.
టిడిపి, కాంగ్రెస్ పార్టీలలోని ఎందరో నాయకులపై ఎన్నెన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని శోభా నాగిరెడ్డి గుర్తు చేశారు. యూరో లాటరీ మోసగాడు కోలా కృష్ణమోహన్కు చంద్రబాబుకు ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలన్నారు. గతంలో యెల్లో మీడియా రాసిన అబద్ధపు రాతలకు గాను ఉప ఎన్నికల్లో యెల్లో కూటమికి రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. తమ రాతలు నమ్ముతారేమో అని పంచాయతీ ఎన్నికల ముందర 'షర్మిలమ్మ పాదయాత్రలో పాపపు సొమ్ము', 'జగన్మోహన్‌రెడ్డి గారిది కిలాడీ పార్టీ' అని యెల్లో మీడియా మళ్ళీ రాసిందని దుయ్యబట్టారు. టిడిపిలో ప్రముఖ పాత్ర పోషించిన ఎందరో అనేక కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొటటున్నారని దీన్నేమంటారని రేవంత్‌రెడ్డిని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి అని ఆమె సలహా ఇచ్చారు.
టిడిపి గాని, దానికి సంబంధించిన మీడియా గాని తాము చేసే కుట్రలను ప్రజలు గమనించడం లేదనుకుంటున్నాయని, అయితే వారి ప్రతి పనినీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారనే విషయాన్ని మరచిపోవద్దని హెచ్చరించారు. యెల్లో మీడియాలో ఆరోపణలు రాయించడం, వాటినే మళ్ళీ మీడియాలో కాంగ్రెస్, టిడిపి నాయకులు వచ్చి మీడియాలో మాట్లాడించడం తొలి నుంచీ చంద్రబాబు తీరు ఇదే అన్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న శ్రీధర్‌రెడ్డి లక్షలాది మందిలో ఎక్కడో ఒక చోట పార్టీ చేరితే చేరి ఉండవచ్చని, అతనికి పార్టీకి సంబంధం ఏమిటని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు.
అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్న నాయకులు టిడిపి, కాంగ్రెస్‌లలో లేరా? అని ఆమె నిలదీశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్న వి.హనుమంతరావు గతంలో ఉస్మానియాలో డ్రైవర్‌గా పనిచేస్తూ డీజిల్‌ను అక్రమంగా అమ్ముకుని సస్పెండైన విషయాన్ని శోభా నాగిరెడ్డి గుర్తుచేశారు. నకిలీ స్టాంపుల కుంభకోణంలో జైలు శిక్ష అనుభవించి వచ్చిన మాజీ మంత్రి కృష్ణా యాదవ్‌ను మళ్ళీ టిడిపిలో చేర్చుకోలేదా? అని సూటిగా ప్రశ్నించారు. మరి టిడిపిని కిలాడి పార్టీ అనరా అని రేవంత్‌రెడ్డి నిలదీశారు. దొంగ నోట్లు ముద్రణ కేసులో ఉన్న మెదక్ జిల్లా టిడిపి ఉపాధ్యక్షునిగా పనిచేసిన ప్రతాని రామకృష్ణ గౌడ్ వ్యవహారాన్ని ఏమంటారని ప్రశ్నించారు.