<p style="" mso-pagination:none=""><strong>ఒంగోలు : </strong>నరాలకు సంబంధించిన వ్యాధితో కన్నుమూసిన వర్ధమాన హీరో, సినీ నిర్మాత బూచేపల్లి కమలాకరరెడ్డి కుటుంబ సభ్యులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ శనివారం పరామర్శించారు. కమలాకరరెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే ఆమె సాయంత్రం 5.30 గంటలకు హుటాహుటిన చీమకుర్తి చేరుకున్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, దర్శి తాజా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డికి కమలాకరరెడ్డి సోదరుడు. కమలాకరరెడ్డి తల్లి వెంకాయమ్మ, భార్య నాగలక్ష్మి, సోదరి ధనలక్ష్మిలను శ్రీమతి విజయమ్మ ఓదార్చారు.<p style="" mso-pagination:none="">అంతకు ముందు కమలాకరరెడ్డి అంతిమయాత్ర మార్గమధ్యంలో ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి శ్రీమతి విజయమ్మ నివాళులు అర్పించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి, ప్రకాశం జిల్లా పార్టీ కన్వీనర్ నూకసాని బాలాజీతో పాటు జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు శ్రీమతి విజయమ్మ వెంట ఉన్నారు.</p></p>