'ఫీజు'పై ప్రభుత్వం విచిత్ర విన్యాసాలు

హైదరాబాద్‌, 18 జూలై 2013:

ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకాన్ని సంతృప్త స్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ 'ఫీజు దీక్ష‌' ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఆమె గురువారం ఉదయం రెండు రోజుల నిరాహార దీక్షకు కూర్చున్నారు.

ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ.. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్న ప్రభుత్వ విచిత్ర విన్యాసాలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థుల సమస్యలపైన పోరాటాలు చేసే పార్టీ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అన్నారు. కార్పొరేట్‌ కాలేజీల కొమ్ము కాసేది తమ పార్టీ కాదని, ప్రజల పక్షాన నిలిచే పార్టీ అని విమర్శకులకు ఆమె ధీటైన సమాధానం ఇచ్చారు.

ఫీజు రీయింబర్సుమెంటుపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద తాము పోరాటం చేస్తున్నామని శ్రీమతి విజయమ్మ అన్నారు. ఇంజనీరింగ్‌ లాంటి ఉన్న వృత్తి విద్యా కోర్సులను కిరణ్‌ ప్రభుత్వం చట్టుబండలు చేయాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఫీజులు నిర్ణయించడంలో ఒక పద్ధతి లేకుంగా చేస్తోందన్నాని విమర్శించారు. ఫీజు రీయింబర్సుమెంటును ఎగ్గొట్టేందుకు అనేక మెలికలు, ఆంక్షలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంసెట్లో పదివేల లోపు ర్యాంకులు వచ్చి వారికే ఫీజు రీయింబర్సుమెంట్‌ అమలు చేస్తామనటం చాలా దారుణం, బాధాకరం అన్నారు. దీని కోసమే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ పోరాటం చేస్తోందన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు 70 శాతం కేంద్రం, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నాయన్నారు. ఒక పద్ధతంటూ లేకుండా ఫీజులు పెంచేస్తున్నారని శ్రీమతి విజయమ్మ మండిపడ్డారు. అయినప్పటికీ కేవలం రూ. 35 వేలు మాత్రమే రీయింబర్సు చేస్తామని ప్రభుత్వం చెప్పడం దారుణం అన్నారు. ఒక్కొక్క కాలేజీలో ఒక్కో రకం ఫీజును నిర్ణయించడాన్ని ఆమె తప్పుపట్టారు. విద్యార్థులను కిరణ్‌ ప్రభుత్వం గందరగోళానికి నెట్టివేస్తున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎంత ఫీజు కట్టుకోవాలో తెలియని స్థితిలో విద్యార్థులు ఉన్నారని అన్నారు. విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

ఇలాంటి గందరగోళ పరిస్థితి ఉండకూడదనే మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి‌ తపించారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ఆయన రెండు కళ్లుగా భావించి ఐఐటీ, ట్రిపుల్ ఐ‌టిలు రాష్ట్రానికి తీసుకువచ్చారని ఆమె ప్రస్తావించారు. ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం, ఒక వైద్య కళాశాలను, ఎన్నో వృత్తి విద్యా కళాశాలలు తీసుకువచ్చారన్నారు. వైయస్ అంటే ఓ నమ్మకం, ఓ భరోసా, ఓ ఆశయం అన్నారు. డబ్బుకు పేదలైనా చదువులో పేదలు కాకూడదన్నదే ఆయన లక్ష్యమని ‌శ్రీమతి విజయమ్మ అన్నారు. అన్ని వర్గాలు బాగుండాలని ప్రతి మనిషీ ఆనందంగా, సంతోషంగా ఉండాలని ఆలోచన చేసిన వ్యక్తి వైయస్‌ రాజశేఖరరెడ్డి అని చెప్పారు. పేదలకు పెద్ద చదువులు అందించడం ప్రభుత్వం బాధ్యత అని వైయస్ఆర్‌ భావించారన్నారు.

అలాంటి మహానేత వైయస్‌ఆర్‌ మన మధ్య నుంచి వెళ్ళిపోయిన ఈ నాలుగేళ్ళలో విద్యా సంస్థల్లో చేరాలంటేనే విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఓ సమస్యగా మారిందని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తంచేశారు. ఈ సంవత్సరం మూడు వేల కోట్లు విడుదల చేస్తే తప్ప ఫీజు రీయింబర్సుమెంటు జరిగే పరిస్థితి లేదని ఆమె అన్నారు. నిధుల విడుదలలో చేతి వాటం చూపించి కత్తెరలు వేస్తున్న ఈ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు మేలు జరగడం అనుమానమే అన్నారు. ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యాల వేధింపులకు నిరుపేద విద్యార్థులు ఆత్మహత్యలకు కూడా పాల్పడిన సంఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరం అన్నారు.

ప్రభుత్వం నిర్లక్ష్యంపై తాము దీక్ష చేసినప్పుడల్లా ప్రభుత్వం కుంటి లెక్కలు చెబుతోందని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. అన్నీ సక్రమంగా చేస్తున్నామని, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు దీక్షలు చేస్తోందంటూ మంత్రి పితాని సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆమె నిప్పులు చెరిగారు. 2011 ఫిబ్రవరిలో వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇదే ఇందిరాపార్కు వద్ద వారం రోజుల పాటు దీక్ష చేసిన విషయాన్ని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. వారం రోజులు ఏమీ తినకుండా ఉంటావా అని తాను అడిగినప్పుడు విద్యార్థులకు ఏ కొంచెం మేలు జరిగినా చాలమ్మా అని చెప్పిన‌ శ్రీ జగన్ మాటలను ఆమె ప్రస్తావించారు. 2012 జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు ధర్నాలు చేయగా ఒంగోలు కార్యక్రమంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్న విషయాన్ని చెప్పారు. అదే సంవత్సరం ఆగస్టులో తాను స్వయంగా పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో రెండు రోజులు ఫీజు దీక్ష చేసిన విషయాన్ని ఆమె తెలిపారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో ఇందిరాపార్కు వద్ద రెండు రోజులు దీక్ష చేసిన వైనాన్ని చెప్పారు.

Students, parents attended Smt. Vijayamma`s Fees deeksha at Indirapark at Hyderabadఫీజు రీయింబర్సుమెంటును వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాధాన్యతా అంశంగా తీసుకుని దీక్షలు చేస్తున్నందువల్లే దాన్ని పూర్తిగా తీసివేయడానికి ప్రభుత్వం భయపడుతోందని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. లేకపోతే ఈ పాటికి రీయింబర్సుమెంటును తుంగలో తొక్కేసి ఉండేదన్నారు. సమస్యలపై ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం మరిన్ని జఠిలమైన సమస్యలు సృష్టిస్తోందని దుయ్యబట్టారు. ప్రజల కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం పోరాటాలు చేయడంలో ముందుంటుందని శ్రీమతి విజయమ్మ హామీ ఇచ్చారు. జగన్‌బాబు నేతృత్వంలో మనం సువర్ణయుగాన్ని తెచ్చుకుంటే.. వైయస్‌ ఆలోచనా సరళిలోనే విద్యార్థులందరికీ చేయూతగా ఉంటుందన్నారు. ఆయన హయాంలో విద్యార్థులందరికీ తప్పకుండా మేలు జరుగుతుందన్నారు.

ఈ ఫీజు దీక్షను తాను మాత్రమే కాకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా శుక్రవారం సాయంత్రం వరకూ ఉండి దీక్ష చేయాలని పిలుపునిచ్చారు. అందరం కలిసి దీక్ష చేస్తే ప్రభుత్వంలో కదలిక వస్తుందన్నారు. అంతకు ముందు వైయస్ కుటుంబాన్ని ఆదరించి, అక్కున చేర్చుకుంటున్నందుకు ఆమె ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ దీక్షా ప్రసంగాన్ని శ్రీమతి విజయమ్మ ప్రారంభించారు. శ్రీమతి విజయమ్మ దీక్షకు బిసి యునైటెడ్ ఫ్రంట్, రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం మద్దతు ప్రకటించాయి.

Back to Top