జగన్‌బాబును మీ చేతుల్లో పెడుతున్నా

గన్నవరం (కృష్ణాజిల్లా),

24 ఆగస్టు 2013: 'నా దీక్షను ప్రభుత్వం భగ్నం చేసినప్పటికీ జైలులోనే జగన్‌బాబు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నా'రని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ తెలిపారు. ప్రజల కోసమే దీక్ష చేపడుతున్న‌ తన బిడ్డ జగన్‌బాబును ఆశీర్వదించాలని ఆమె రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిజానికి తాను నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తానని చెప్పానని అయితే.. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా దీక్ష విరమించాలని జగన్‌బాబు తనను కోరారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకూ సమన్యాయం చేయాలని అలా చేయలేకపోతే యధాతథంగా ఉంచాలంటూ ఆరు రోజులుగా గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేసిన శ్రీమతి విజయమ్మ శనివారం తన దీక్షను విరమించారు. సమరదీక్ష విరమించిన అనంతరం శ్రీమతి విజయమ్మ హైదరాబాద్‌ వస్తూ గన్నవరం విమానాశ్రయంలో కాసేపు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రాన్ని అడ్డంగా విభజిస్తే నీటి సమస్యలు వస్తాయని శ్రీమతి విజయమ్మ ఆందోళన వ్యక్తంచేశారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ ఉప్పునీళ్ళే గతి కావాలా? అని ప్రశ్నించారు. అందరూ కలిసి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌ను గంపగుత్తగా తెలంగాణకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అన్నదమ్ముల్లా ఉన్న ప్రజల మధ్య విభజన చిచ్చు పెట్టారు. విభజన తరువాత సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తారని నిలదీశారు. న్యాయం చేయలేకపోతే విభజన చేసే హక్కు కాంగ్రెస్‌కు ఎవరిచ్చారని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్‌ చేశారు. దివంతగ మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మూడు ప్రాంతాలనూ సమానంగా ప్రేమించారని, సమానంగా అభివృద్ధి చేశారని, మూడు ప్రాంతాల్లోనూ సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమానంగా అమలు చేశారని ఆమె గుర్తుచేశారు. డాక్టర్‌ వైయస్ఆర్‌ వారసత్వాన్ని పుణికిపుచ్చుకునే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటైందన్నారు.

అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయాలని శ్రీమతి విజయమ్మ డిమాండ్‌ చేశారు. విభజన జరిగితే నీటి సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె కోరారు. హైదరాబాద్‌లో ఉంటున్న వారికి భద్రత ఎలా కల్పిస్తారో చెప్పాలన్నారు. రా‌ష్ట్రాన్ని విభజిస్తే.. 45 శాతం వస్తున్నహైదరాబాద్ ఆదాయం అంతా ఒకే ప్రాంతానికి పోతే మిగతా వాళ్ళ సంగతి ఏమి కావాలని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోతే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంటు లాంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తారని నిలదీశారు. చదువుకునే పిల్లలకు ఉద్యోగావకాశాలు ఎలా చూపిస్తారని అడిగారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న వారికి భద్రత ఏ విధంగా కల్పిస్తారో చెప్పాలన్నారు.

మన రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి లేదని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. మధ్యలో మరో రాష్ట్రం వస్తే నీటి సమస్య మరింత పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. శ్రీశైలానికి, నాగార్జునసాగర్‌కు నీళ్ళు ఎలా ఇస్తారన్నారు. జాతీయ ప్రాజెక్టు చేసిన పోలవరానికి ఏ విధంగా నీళ్ళిస్తారో చెప్పాలన్నారు. నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, హంద్రీ నీవా, పులిచింతల లాంటి మిగులు జలాలపై ఆధారపడి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులకు ఎక్కడి నుంచి నీళ్ళు తెస్తారో ప్రభుత్వం వివరించాలన్నారు.

ఓదార్పు యాత్ర చేస్తున్న సమయంలోనే జగన్‌బాబు రైతులు, గిట్టుబాటు ధరల కోసం, నీటి కేటాయింపుల విషయంలో, విద్యార్థుల ఫీజుల కోసం, చేనేత కార్మికుల ప్రయోజనాల కోసం ఇలా అన్ని రకాలుగా దీక్షలు చేసిన వైనాన్ని శ్రీమతి విజయమ్మ ప్రస్తావించారు. రాష్ట్రంలోని ప్రతి సమస్య పైనా ఆయన స్పందించారన్నారు. అన్యాయంగా, అక్రమంగా తనను జైలులో పెట్టినా కూడా రేపటి నుంచి జగన్‌బాబు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని వింటున్నానన్నారు. దీక్ష చేయనని జగన్‌బాబు మాట ఇస్తేనే.. తాను దీక్ష విరమిస్తానని చెప్పానని.. అయితే తాను ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పలేదని ఉద్వేగపూరితంగా తెలిపారు. రాష్ట్ర విభజనపై ప్రకటన వచ్చినప్పటి నుంచీ జగన్‌బాబు చాలా ఆవేదన చెందుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలందరి కోసం జగన్‌బాబు జైలులో నిరవధిక నిరాహార దీక్ష చేయబోతున్నారని గద్గద స్వరంతో శ్రీమతి విజయమ్మ తెలిపారు. తన బిడ్డను ఆశీర్వదించమని ప్రజలకు ఆమె విజ్ఞప్తిచేశారు. రాష్ట్రానికి, జగన్‌బాబుకు మంచి జరగాలని ఆమె కోరారు.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయలేదు కనుకే కాంగ్రెస్‌ పార్టీ సునాయాసంగా విభజన నిర్ణయం తీసుకుందని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. ముందుగా మంత్రులు రాజీనామా చేసిన తరువాతే టిడిపి, బిజెపి ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే బాగుండేదని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేసి ఆత్మగౌరవ యాత్ర పేరుతో ప్రజల్లోకి వస్తే మంచిదని హితవు పలికారు.

తాజా ఫోటోలు

Back to Top