మోసగించేందుకే తెల్లకాగితం మీద సంతకాలు

 • రైతులు, దళితులు, ఎస్సీ, ఎస్టీల భూములు దోచుకున్నారు
 • సింగపూర్ కు అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు
 • బాబు పరిపాలన తీరే మోసానికి నిదర్శనం, రాష్ట్ర ప్రజలను కొల్లగొట్టడం
 • రైతులకు ప్లాట్ల కేటాయింపులో మీ చిత్తశుద్ధి ఏంటి బాబు..?
 • రైతులను మోసం చేసేందుకే తెల్లకాగితం మీద సంతకాలు
 • టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన మేరుగు నాగార్జున

 • హైదరాబాద్ః రాజధాని భూములను సింగపూర్ కంపెనీలకు అమ్ముకొని చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున నిప్పులు చెరిగారు. బాబు పరిపాలన తీరే మోసానికి నిదర్శనమని, ఆయన ఆలోచన సరళే రాష్ట్ర ప్రజలను కొల్లగొట్టడమని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో భూములు తీసుకున్న రైతులకు ప్లాట్ల కేటాయించడంలో మీ చిత్తశుద్ధి ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. తెల్లకాగితం మీద సంతకాలు చేసి ప్లాట్లు ఇచ్చామని చెబుతున్నారు. ఎప్పటికి ఇస్తారు. ఎన్ని సంవత్సరాలకు ఇస్తారు.  ఇదే మాదిరి రుణమాఫీ చేస్తామని తెల్లకాగితం మీద సంతకం చేశారని..అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అది అతీగతీ లేదని విమర్శించారు. రైతులను మోసం చేయడానికే తెల్లకాగితం మీద సంతకాలని ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేరుగు నాగార్జున మాట్లాడారు. 

  ఆనాడు రైతుల వద్ద భూములు లాక్కునేటప్పుడు త్రికరణ శుద్ధితో వారి అభివృద్ధికి కృషిచేస్తామని బాబు హామీ చెప్పారు. ఇప్పుడేమో ఎలాంటి అభివృద్ధి చేయకుండానే తెల్లకాగితం మీద సంతకాలు చేసి ప్లాట్లు ఇస్తామని మోసగిస్తున్నారు. ఏ ప్రాంతంలో ప్లాట్ ఉంటుందో, ఏ రేటు వస్తుందో, ఏ విధమైన అభివృద్ధి ఉంటుందో, ఏవిధమైన న్యాయం జరుగుతుందో చెబితే రైతులు గుండె మీద చేయివేసుకొని నిబ్బరంగా ఉండేవాళ్లు . కానీ, అవేమీ చెప్పకుండా దూర ప్రాంతంలో రైతులకు ప్లాట్లు ఇస్తే వాళ్లకు లాభమెలా ఉంటుందని ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. రాజధానిలో ఈ రోజుకు గ్రామకంఠకాలు ఎక్కడున్నాయో తేల్చలేదు. సర్వే చేయలేదు. దళితులను భయభ్రాంతులకు గురిచేసి అనాదిగా వాళ్లు పండించుకునే పంటలను లాక్కున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం నేతలంతా  భూములను దోచుకున్నారు. లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని మీడియా కోడై కూసింది. దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని తమ అధ్యక్షులు వైయస్ జగన్ అసెంబ్లీలో అడిగితే దానికి తిలోదకాలిచ్చారు. అసైన్డ్ భూములేమయినయి. గ్రామకంఠాల సంగతి ఎందుకు తేల్చడం లేదని నాగార్జున టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. 

  రైతాంగాన్ని, రైతు కూలీలను, ఎస్సీ, ఎస్టీలను భయభ్రాంతులకు గురిచేశారు. రాజధానిలో కౌలు రైతులకు ఇప్పటి వరకు చెక్కులివ్వలేదు. పెన్షన్ ఇవ్వడం లేదు. దళితుల భూములు లాక్కొని వారికి పెన్షన్ కూడా రాకుండా చేసిన సంస్కృతి టీడీపీదని నాగార్జున ధ్వజమెత్తారు. సింగపూర్ కంపెనీలకు  17 వేలకు పైగా ఎకరాలను అప్పనంగా ధారపోశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే బాబు తెల్లకాగితం మీద సంతకం చేస్తున్నారని, రాష్ట్రాన్ని ఇతర దేశాలకు అమ్మేస్తున్నారని నాగార్జున ఫైర్ అయ్యారు. సింగపూర్ కంపెనీలతో సీసీడీఎంసీ ద్వారా కుదుర్చుకున్న రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలని, అది ఎవరికి లబ్ధి చేకూరుస్తుందో బట్టబయలు చేయాలని  నాగార్జున చంద్రబాబును డిమాండ్ చేశారు.  రాజధాని ప్రాంతంలో రైతుల వద్ద నుంచి 33 వేల ఎకరాలు లాక్కున్నారు. 5,6 వేల ఎకరాలన్నా అభివృద్ధి చేశారా బాబు ..? అని నాగార్జున  నిలదీశారు.  మీకు ఓట్లు వేసి గెలిపించిన రైతాంగాన్ని ఎందుకు ఈవిధంగా మోసం చేస్తున్నారని నాగార్జున చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  వైయస్ జగన్ రాజధానికి వ్యతిరేకమని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.  రాజధానికి తాము వ్యతిరేకం కాదని మొదటి నుంచి చెబుతున్నాం. న్యాయబద్ధంగా  అనువైన ప్రాంతంలో రాజధాని పెట్టాలని, కేంద్రం నుంచి నిధులు తేవాలని, బ్రహ్మాండంగా రాజధాని నిర్మించాలనే వైయస్ జగన్ చెబుతున్నారని నాగార్జున తెలియజేశారు. శాస్త్రవేత్తలు సైతం నల్లరేగడి నేలల్లో బిల్డింగ్ లు కడితే నిలవవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, చివరకు వారి చెప్పిందే జరిగిందన్నారు. చిన్న చినుకులకే నీరు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడితే,  ప్లాట్లు ఇవ్వడం వాయిదా వేశామని చెబుతున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారే. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది. ఎందుకు ఆలోచన చేయడం లేదు.  మీ మంది మార్భలం,  డూడూ బసవన్నలాగా తల ఊపే మంత్రులు, ఎమ్మెల్యేలు రాజధానిలోని ఆకృత్యాల గురించి ఏం సమాధానం చెబుతారని నాగార్జున నిలదీశారు. ఇప్పటికైనా నిబద్ధతతో  ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ ఆలోచనలు తీసుకొని రాజధానిలో రైతులకు, రైతు కులీలకు ఉపయోగపడాలని ప్రభుత్వానికి సూచించారు. 
Back to Top