ఆ 1700 ఎకరాల్లో ప్లాట్లు ఎక్కడ..?

రాజధానిలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలి
రైతుల భూములను విదేశీ కంపెనీలకు అమ్ముకుంటున్నారు
సింగపూర్ కంపెనీలతో సీక్రెట్ ఒప్పందాన్ని బయటపెట్టాలి
రాజధాని భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి
బాబు  ప్రజల సొమ్మును నీళ్లపాలు చేస్తున్నారు
టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే

హైదరాబాద్ః రాజధానిలో రైతుల నుంచి దోచుకున్న భూములను విదేశీ కంపెనీలకు అమ్ముకుంటూ చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రైతులకు కమర్షియల్ , రెసిడెన్షియల్ ప్లాట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం...ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. 1700 ఎకరాల భూములను విదేశీ కంపెనీలకు అమ్ముకునేందుకు చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందమేంటో బయటపెట్టాలని ఆర్కే డిమాండ్ చేశారు. ఆ 1700 ఎకరాలలో రాజధానికి భూములిచ్చిన రైతులకు నివాస, వాణిజ్య స్థలాలు ఎక్కడ ఇస్తున్నారో చెప్పకపోగా, విదేశీ కంపెనీలతో లోపాయికారి ఒప్పందం చేసుకొని ఎకరా రూ.4 కోట్లకు అమ్ముడుపోతుందని ప్రచారం చేస్తున్నారని ఆర్కే ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. 

పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టి, తెల్ల కాగితాల మీద నెంబర్లు వేసి తూతూమంత్రంగా కొంతమందికి ఇచ్చారని, ఆ తర్వాత వర్షం వస్తోందని వాయిదా వేశామంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పే మాయమాటలను అందరూ నమ్మి మోసపోయారని ఆర్కే అన్నారు. ఎక్కడైనా ప్రభుత్వం - ప్రైవేటు భాగస్వామ్యం లాంటి ఒప్పందాలు జరిగితే హక్కుదారుడికి ఎక్కువ వాటా, వ్యాపారులకు తక్కువ వాటా ఇస్తారని.. కానీ ఇక్కడ మాత్రం 58 శాతం విదేశీ కంపెనీలకు, కేవలం 42 శాతం మాత్రం సీఆర్డీఏ వాళ్లకు ఇస్తామంటున్నారని, ఇలా జరగడం ఏంటని ప్రశ్నించారు. ఆ 58 శాతంలో కొంత మళ్లీ వాళ్లు ఎప్పుడైనా, ఎవరికైనా ఎంత రేటుకైనా అమ్ముకోవచ్చని కొత్త సిద్ధాంతం చెబుతున్నారని... ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడా లేదని విమర్శించారు. 

ఇక చంద్రబాబు పదే పదే చెబుతున్న స్విస్ ఛాలెంజ్ ఏంటనేది ఎవరికీ తెలియట్లేదని ఆర్కే అన్నారు. 2015 డిసెంబర్ నెలలో కేంద్రం ఈ స్విస్ చాలెంజ్ మీద కేల్కర్ కమిటీ వేసిందని, ఆ కమిటీ అన్ని విషయాలూ పరిశీలించి చాలా స్పష్టంగా కేంద్రానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు. స్విస్ చాలెంజ్ పద్ధతి సరికాదని, అలా ఎవరూ చేయొద్దని అది దేశానికి, రాష్ట్రానికి, అందరికీ నష్టమేనని కేల్కర్ చెప్పారని గుర్తుచేశారు. అందుకే చంద్రబాబు ఆదేశాలిచ్చినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రం స్విస్ ఛాలెంజ్ ఒప్పందాల మీద సంతకం చేయలేదని ఆర్కే అన్నారు. 

ఇక చంద్రబాబు కొత్త సంప్రదాయానికి తెరతీశారని, సాధారణంగా కింద నుంచి పైకి ఫైళ్లు వెళ్లాలి కానీ, ముందు ముఖ్యమంత్రి సంతకం చేసి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపుతున్నారని, ఆమాత్రం దానికి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎందుకు.. అన్నిపోస్టులూ బాబే తీసుకుంటే పోలా అని ఎద్దేవా చేశారు.  రాజధానికి భూములు ఇవ్వని రైతుల మీద కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని, వాళ్ల పొలాలను టార్గెట్ గా చేసుకుని ఎక్స్ప్రెస్ హైవేను డిజైన్ చేశారని, ఇది ఎంతమాత్రం తగదని ఆర్కే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాటిమాటికి విమానాల్లో విదేశాలు తిరుగుతూ చంద్రబాబు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆర్కే ఆగ్రహం వెలిబుచ్చారు. రాజధానిలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియజెప్పాలని, తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Back to Top