షర్మిల పాదయాత్రకు న్యాయవాదుల సంఘీభావం

మద్దూరు (మహబూబ్‌నగర్‌ జిల్లా), 1 డిసెంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు హైదరాబాద్‌, పాలమూరు జిల్లాల న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. శ్రీమతి షర్మిల చేస్తున్న పాదయాత్ర 45వ రోజు శనివారంనాడు సుమారు 200 మంది న్యాయవాదులు ఆమె అడుగులో అడుగు వేసి నడిచారు. పాలమూరు జిల్లా మక్తల్‌ నియోజకవర్గం పరిధిలోని మద్దూరు వద్ద న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను తేటతెల్లం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకోలేరని తెలిపారు. చంద్రబాబు తన కోసం పాదయాత్ర చేసుకుంటున్నారని విమర్శించారు. ఆయన పాదయాత్రలో పట్టుమని 10 మంది కూడా కనిపించని వైనాన్ని న్యాయవాదులు గుర్తుచేశారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైలులో నిర్బంధించడాన్ని న్యాయవాదులంతా ముక్తకంఠంతో ఖండించారు.

చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారని న్యాయవాదులు ఎద్దేవా చేశారు. ఆయన పాదయాత్ర ప్రజలకు మేలు చేకూర్చేది కాదన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి వెంటే ఉన్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర న్యాయ విభాగం నుంచి లాయర్లు హైదరాబాద్‌ నుంచి వచ్చినట్లు తెలిపారు. చట్టాలను కూడా అధిగమించి రాజకీయ కుట్రలో భాగంగానే శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైలులో పెట్టించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై చట్టాలను కూడా తుంగలో తొక్కి 90 రోజుల్లో శ్రీ జగన్మోహన్‌రెడ్డికి ఇవ్వాల్సిన బెయిల్‌ రానివ్వకుండా చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజాభీష్టాన్ని కాదని, ప్రజలకు కావాల్సిన రాజకీయ నాయకుడిని జైలులో పెట్టి, తమ సంక్షేమాన్ని తమకు దూరం చేస్తున్నారన్న బాధతోనే ఒక మేధావి కుటుంబంగా రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి 200 మంది తరలివచ్చినట్లు చెప్పారు. తమకు పాలమూరు జిల్లా న్యాయవాదులు కూడా మద్దతుగా వచ్చారని, శ్రీమతి షర్మిల పాదయాత్రలో భాగస్వాములయ్యారని చెప్పారు.
Back to Top