జనవాహినికి 'వంద'నం



తాడిమర్రి

24 అక్టోబర్ 2012 : షర్మిల మరో ప్రజాప్రస్థానం బుధవారంతో వంద కిలోమీటర్లకు చేరుకుంది. అనంతపురం జిల్లా తాడిమర్రి సమీపంలో షర్మిల వంద కిలోమీటర్ల నడకను పూర్తి చేశారు. ఈ నెల 18 న ఇడుపులపాయలో ప్రారంభమైన షర్మిల పాదయాత్ర రోజుకు సగటున పదిహేను కిలోమీటర్ల మేర సాగుతోంది. వైయస్ఆర్ జిల్లాలో సుమారు ఆరు రోజుల పాటు పర్యటించిన షర్మిల ఏడవ రోజు అనంతపురం జిల్లాలో జనంతో మమేకమౌతూ తన యాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. అనంతపురం పల్లెలు షర్మిల పాదయాత్రకు నీరా'జనం' పడుతున్నాయి. ఆర్భాటాలకు పోకుండా అరుగులపై, చెట్లనీడల్లోనూ షర్మిల ప్రజలతో మాట్లాడుతున్నారు. వారి కష్టాలు తెలుసుకుంటున్నారు. కన్నీళ్లు తుడుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైన వైనాన్ని ప్రజల నోటి వెంట వింటున్నారు. ప్రధానప్రతిపక్షం అధికారపక్షంతో ఎలా కుమ్మక్కు అయిందో జనానికి సరళమైన పద్ధతిలో వివరిస్తున్నారు. నీచరాజకీయాలతో జగనన్నను జైలు పాలు చేశారని చెబుతున్నారు. అయితే జగనన్న త్వరలోనే బయటకు వస్తాడనీ, తప్పక మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందనీ ఆమె భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. వైయస్‌ను ప్రేమించే రైతులపై ప్రభుత్వం కక్షగట్టి సాధిస్తోందని ఆమె విమర్శిస్తున్నారు. అవసరమైన చోట్ల స్థానిక నాయకులకు ప్రజాసంక్షేమ కార్యక్రమాలు పురమాయిస్తున్నారు. శివంపల్లిలో మంచినీళ్లకు ఎద్దడిగా ఉందని జనం చెప్పగా, వారంలో రెండులక్షల రూపాయల ఖర్చుతో వైయస్ఆర్ సీపీ నాయకుడు మర్రి చంద్రశేఖర్ రెడ్డి మీకు నీళ్లందిస్తారని షర్మిల హామీ ఇచ్చారు. మరోచోట జగదీశ్వర్ రెడ్డి అనే వికలాంగుడు తాను పీజు రీ యింబర్స్‌మెంట్ రాకపోవడం వల్ల ఎంబిఏ చదవలేకపోయానని చెప్పగా, తానే చదివిస్తానని షర్మిల వాగ్దానం చేశారు. గొర్రెలకాపర్లతో కూడా ఆమె మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అనంత దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం చేసిందేమీ లేదనీ, రాజస్థాన్ తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపురం అని షర్మిల అన్నారు.
ఇదిలావుండగా షర్మిల మరో ప్రజాప్రస్థానానికి సంఘీభావంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వైయస్ఆర్ సీపీ శాఖలు పాదయాత్రలు నిర్వహించాయి. ఆదోనిలో షర్మిల యాత్ర విజయవంతం కావాలని కోరుతూ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో ప్రత్యేక పూజలు జరిపారు. బుధవారం సాయంత్రంతో మొత్తం 104 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసిన షర్మిల శివంపల్లి సమీపంలో రాత్రికి బస చేశారు.
షర్మిల పాదయాత్రకు విశేష ప్రజాస్పందన ఉందన్న వైయస్ఆర్ సీపీ నాయకులు బాలినేని శ్రీనివాస రెడ్డి, దమ్మూ ధైర్యమూ ఉంటే చంద్రబాబు ఈ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాలు విసిరారు.

Back to Top