ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం రండి

గుంతకల్లు టౌన్‌: అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో చంద్ర‌బాబు వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనడమే కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి పదవులు కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త వై. వెంక‌ట్రామిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. అప్రజాస్వామిక ప్రభుత్వం పతనానికై పోరాడేందుకు ప్రజాస్వామ్యవాదులంతా కలసిరావాలని వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. చంద్రబాబు మూడేళ్లల్లో అభివృద్ది చేసి ఉంటే 21 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించడానికి ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తన కుమారుడు లోకేష్‌ను ఎన్నికల బరిలో దింపే దమ్ములేక ఎమ్మెల్సీగా ఎన్నుకుని అతనికి కీలకమైన మంత్రిపదవి కట్టబెట్టడం వెనుక ఓ మాస్టర్‌ప్లానే ఉందని అనుమానం వ్య‌క్తం చేశారు. తెలంగాణలో తలసాని శ్రీనివాసయాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి పొందినప్పుడు రాజ్యాంగ విరుద్ధ‌మని గొంతు చించుకున్న చంద్రబాబు ఏపీలో చేసిందేమిటని, దయ్యాలు వేదాలు వల్లించడం కాదా అని ఆయన ప్రశ్నించారు. వరుస కరువులతో రైతులు, ప్రజలు, ఉపాధిలేమితో కూలీలు, నిరుద్యోగులు ఆకలిచావులకు గురవుతున్నా ఆదుకోలేని అసమర్థుడు చంద్రబాబు అని ఆయన నిప్పులు చెరిగారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇంత నీచ పాలనను కొనసాగిస్తున్న ఏకైక సీఎంగా చంద్ర‌బాబు చరిత్రలో నిలిచిపోతాడన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా సేవ్‌డెమోక్రసీ పేరుతో శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉదయం 9:30 గంటలకు నిర్వహిస్తున్న ధర్నాకు నియోజకవర్గంలోని మూడు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు తరలిరావాలని వై.వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల రామాంజినేయులు, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు వై.సుధాకర్, మోహన్‌రావు, కౌన్సిలర్ అహ్మద్‌బాషా, మాజీ కౌన్సిలర్ సుంకప్ప, అధికార ప్రతినిధి దశరథరెడ్డి, ఎస్టీ సేవాదళ్‌ల కన్వీనర్లు గోవింద్ నాయక్, జయరామిరెడ్డి, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top