సర్‌చార్జీలపై విజయనగరంలో వైయస్‌ఆర్‌సిపి ధర్నా

విజయనగరం, 18 డిసెంబర్‌ 2012: కాంగ్రెస్‌ ప్రభుత్వం సర్‌చార్జీల ముసుగులో ప్రజలను నిలువుదోపిడీ చేస్తోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పెన్మత్స సాంబశివరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సామాన్యుల ఉసురు తీసేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి త్వరలోనే గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. విద్యుత్‌ బిల్లుల్లో వేస్తున్న సర్‌చార్జీలను వ్యతిరేకిస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం విజయనగరంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సాంబశివరాజు మాట్లాడారు. ‌విద్యుత్‌ సర్‌చార్జీల కారణంగా ఇంటి యజమానులే కాకుండా, అద్దెకు ఉన్నవారికి కూడా తలనోప్పులు పెరిగిపోయాయని పెన్మత్స ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సర్‌చార్జీలను తక్షణమే రద్దు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.

అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే నిలదీయకుండా ప్రధాన ప్రతిపక్షం టిడిపి నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించడమేమిటని పార్టీ యువజన విభాగం కన్వీనర్‌ విజయ్ సూటిగా ప్రశ్నించారు. 'ప్రభుత్వం విధించిన విద్యుత్‌ సర్‌చార్జీలను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాల'ని, 'విద్యుత్‌ సర్‌చార్జీల మోత, సామాన్యుడికి వాత' అని నినాదాలు రాసిన ప్లకార్డులను ఈ ధర్నా సందర్భంగా ఆందోళనకారులు ప్రదర్శించారు.

Back to Top