రాజు మంచివాడైతే దేవుని దయ ఉంటుంది

మాచర్ల:

‘పాలించే రాజు మంచివాడైతే.. దేవుని దయకూడా ఉంటుంది. వర్షాలు సకాలంలో పడతాయి. పంటలు పండుతాయి. వైయస్ఆర్ సువర్ణపాలనలో వర్షాలకు కొదవలేదు.. పంటలు బాగా పండాయి. రైతన్నలకు మద్దతు ధర పలికింది. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత మన రాష్ట్రాన్ని ఈ పాలకులు నాశనం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు ఎలా కష్టాలు, కన్నీళ్లు పెట్టారో ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ అలాంటి పరిస్థితులే వచ్చాయి' అని  శ్రీమతి షర్మిల చెప్పారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా బుధవారం జూలకల్లులో నిర్వహించిన రచ్చబండలో ఆమె మాట్లాడారు. పంటకు గిట్టుబాటు ధర లేక, చేసిన అప్పులు తీరక  రైతులు భూములను అమ్ముకుంటున్నారన్నారు. మరి కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.  ఇదే జిల్లాలో అప్పుల బాధ తట్టుకోలేక ఓ పత్తి రైతు అత్మహత్య చేసుకున్నాడని విన్నానన్నారు.  ఈ పాలకులకు రైతన్న గోడు పట్టడం లేదనీ, వీళ్లు పదవులు కాపాడుకోవడానికి ఢిల్లీ చుట్టూ తిరగడమే సరిపోతోందనీ చెప్పారు. వీళ్ల చొక్కా పట్టుకొని నిలదీయాల్సిన చంద్రబాబు ఆ పని చేయట్లేదని ఆరోపించారు.  ప్రజలు ఏమైపోయినా ఫర్లేదనుకుంటున్నారని ధ్వజమెత్తారు. అందుకే అవిశ్వాసం పెట్టడం లేదన్నారు. తన అవినీతి ఆరోపణల మీద ఏ విచారణా రాకుంటే చాలని చంద్రబాబు అనుకుంటున్నారని  దుయ్యబట్టారు.

జగనన్న వస్తారు... రైతును రాజుగా చూస్తారు..
     ‘రైతన్నలకు భరోసా ఇచ్చి మళ్లీ చెప్తున్నా.. మళ్లీ మంచి రోజులు వస్తాయి. జగనన్న త్వరలోనే బయటికి వస్తారు. రైతును రాజుగా చూసుకుంటారు. రాజన్న ఇచ్చిన ఉచిత విద్యుత్తును కొనసాగిస్తారు. అప్పుడు 9 గంటల ఉచిత విద్యుత్తు అందుతుంది. అప్పుల నుంచి మీకు విముక్తి కల్పించి, వడ్డీ లేని రుణాలు అందిస్తారు. అంతవరకు మీరు ఓపిక పట్టండి. దయచేసి ఏ ఒక్కరూ కూడా విలువైన మీ భూములను అమ్ముకోవద్దన్నా.. అంతకంటే విలువైన మీ ప్రాణాలను తీసుకోవద్దన్నా’ అని శ్రీమతి షర్మిల రైతులను కోరారు.

Back to Top